ప్రశ్నించడం కోసం అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) 2014లో జనసేన(Janasena) పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి దశాబ్ధకాలం పాటు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. 2019 ఎన్నికల్లో కేవలం ఒక్క జనసేన ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. చివరకు ఆ ఎమ్మెల్యే కూడా పార్టీకి రాజీనామా చేశారు. దీంతో జీరోకి పడిపోయింది పార్టీ. అయినా కానీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెన్నుచూపలేదు. భయపడలేదు. తన లక్ష్యం వైపు బలంగా అడుగులు వేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడ్డారు.
అధికార వైసీపీని ఘోరంగా ఓడించి తనను ఘోరంగా తిట్టిన నేతల నోళ్లను మూయించారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100శాతం స్ట్రయిక్ రేట్‌తో దేశం మొత్తం తన వైపు చూసేలా చేశారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి అపూర్వ విజయం తర్వాత నిర్వహించనున్న తొలి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జనసేన సిద్ధమవుతోంది. పవన్ సొంత నియోజవర్గం పిఠాపురంలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు జనసేన పార్టీ అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేసింది.
“సాధించిన విజయాన్ని సగర్వంగా చాటుదాం…రానున్న కాలానికి దిశానిర్దేశం చేసుకుందాం… జాతీయ రాజకీయాల్లో తిరుగులేని బావుటా ఎగురవేద్దాం… జనసేన పార్టీ అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన మార్చి 14న పిఠాపురంలో ఘనంగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుందాం” అని జనసైనికులకు పిలుపునిచ్చింది. దీంతో జనసైనికులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.