MLAs poaching case : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కీలక నేత బీఎల్ సంతోష్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తమ ముందు విచారణకు హాజరు కావాలని తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నోటీసులు జారీ చేయగా.. దీనిపై శుక్రవారం సంతోష్ హైకోర్టును ఆశ్రయించారు. సిట్ నోటీసులపై న్యాయస్థానం స్టే విధించింది. విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సంతోష్ పేరు కూడా తెరపైకి రావడంతో సిట్ ఆయన్ను నిందితుల జాబితాలో చేర్చింది. సీఆర్‌పీసీ 41ఏ కింద ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, నోటీసు రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. కేసును అత్యవసరంగా విచారణ జరపాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ముందుగా నిర్ణయించుకున్న కొన్ని సమావేశాల కారణంగా కోర్టుకు సంతోష్ రాలేకపోయారని ఆయన తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేదని, ఎఫ్ఐఆర్‌లో కూడా పేరు లేనప్పుడు ఆయన్ని నిందితుల జాబితాలో ఎలా చేరుస్తారని అభ్యంతరం లేవనెత్తారు. ఈ విషయాలను అన్నింటిని పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు బీఎల్ సంతోష్ కు ఊరట కలిగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.