హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్(KCR) అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణపై, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరీ తదితర అంశాలపై చర్చించారు. పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానంపై వివరించారు. తెలంగాణ ఉద్యమం, అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. తెలంగాణ గురించి, ప్రజల గురించి బీఆర్ఎస్ మాత్రమే ఆలోచించగలదని తెలిపారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కిపోతోందని.. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఇక ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 10 నుంచి 27 వరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. ఇక అక్టోబర్, నవంబర్‌లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. పార్టీ రజతోత్సవ వేడుకలను ఏడాది పొడవునా నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ కమిటీల ఇంఛార్జి బాధ్యతలను మాజీ మంత్రి హరీశ్ రావుకు అప్పగించారు.


