ఇటీవల ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మంగళవారం తెలంగాణ హైకోర్టు(TG Highcourt)లో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్‌కు గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే. న్యాయస్థానంలో కేసు వాదిస్తున్న సమయంలోనే ఆయన కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన తోటి లాయర్లు, కోర్టు సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే మరో న్యాయవాది గుండెపోటులో చనిపోవడం కలకలం రేపుతోంది.
సికింద్రాబాద్ కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటరమణ.. కోర్టు ఆవరణలో ఉన్న బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్లారు. డబ్బులు డిపాజిట్ చేస్తుండగా గుండెపోటు(Heart attack)కు గురయ్యారు. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. వెంకటరమణ మృతి పట్ల లాయర్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కాగా నిత్యం వాదనలు, కేసులతో బిజీగా ఉంటున్న లాయర్లు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.