Monday, November 25, 2024
Homeఓపన్ పేజ్Oscar: ఆస్కార్‌ కొత్త పుంతలు

Oscar: ఆస్కార్‌ కొత్త పుంతలు

ఇటీవలి వరకూ పాశ్యాత్య దేశాలకు, ఆసియాయేతర దేశాలకు మాత్రమే పరిమితమైన ఆస్కార్‌ అవార్డులు క్రమంగా ఆసియా వైపు కూడా చూస్తున్నట్టు కనిపిస్తోంది. దేశీ చిత్రాల విషయంలో ఈ అవార్డుల న్యాయమూర్తులకు ఉన్న అవగాహనలో క్రమంగా మార్పు చోటు చేసుకుంటోందనడానికి ఈసారి ఆసియా చిత్రాలకు కూడా పురస్కారాలు ప్రకటించడం ఒక సంకేతం అనుకోవచ్చు. అయితే, ఏదో ఒక రోజున ఆసియా దేశాల చిత్రాలకు కూడా అవార్డులు లభించడం ఖాయమని ఊహించిందే. అది ఈ ఏడాదే జరగడం మాత్రం సంభ్రమాశ్చర్యాలు కలిగించింది. ‘నాటు నాటు’ అనే పాటకు, ‘ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ అనే తక్కువ నిడివి సినిమాకు, ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’ అనే డాక్యుమెంటరీకి ఆస్కార్‌ అకాడమీ అవార్డులు రావడం ఖాయమని వాటికి సంబంధించిన నామినేషన్లు పంపించినప్పుడే తెలుసు. అయినప్పటికీ, ఈ అవార్డులు ప్రకటించడానికి అనేక వారాల ముందు నుంచే అందరూ ఉత్కంఠతో ఎదురు చూశారు. మొత్తానికి మొదటి రెండింటినీ ఆస్కార్‌ వరించింది.కొత్త చరిత్రకు, కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టయింది. ఎదురు చూపులకు తగిన ఫలితం దక్కినట్టయింది.
మొదటిసారిగా రెండు భారతీయ తయారీలు చలన చిత్ర రంగంలోనే అత్యున్నత ప్రమాణాలు (బంగారు ప్రమాణాలు) కలిగిన పురస్కారాలను స్వీకరించడం చిన్న విషయమేమీ కాదు. సుమారు 14 ఏళ్ల క్రితం ఏ.ఆర్‌. రెహ్మాన్‌, రసూల్‌ పూక్కుట్టి ‘స్లమ్‌ డాగ్‌ మిలియనైర్స్‌’ చిత్రానికి ఆస్కార్‌ అవార్డులు గెలుచుకున్న సంగతి నిజమే. కానీ, అది పూర్తిగా బ్రిటిష్‌ చిత్రం. ‘నాటు నాటు’ పాట ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం వంద శాతం మనదే. అదే విధంగా ‘ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ కూడా మనదే.ఇందులో మొదటి చిత్రం ఒక బాలికను తప్పించడానికి హీరో చేసే ప్రయత్నం.అది ఫాంటసీ చిత్రమే కావొచ్చు కానీ, పాశ్చాత్య లేదా హాలీవుడ్‌ చిత్రాలకు ఏమీ తీసిపోని చిత్రం. ఇక రెండవది ఎంతో శ్రమ, సహనాలతో దేశీయ జీవన విధానంపై తీసిన లఘు చిత్రం. సాంస్కృతికంగా అవి భారతీయతను సంతరించుకున్న అపురూప చిత్రాలనడంలో సందేహం లేదు. మనం మరచిపోయిన ఒక సామరస్య జీవితం గురించి ‘ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ చిత్రం కళ్లకు కట్టే విధంగా చెబుతుంది. ఈ చిత్రంలో భారతీయత అడుగడుగునా ఉట్టిపడుతుంది. ప్రేమ, సానుభూతి, పరస్పర గౌరవాభిమానాలు, అనుబంధాలు, నిరాడంబర జీవితం, అందమైన కుటుంబ జీవితం వంటి అంశాల గురించి ఈ లఘు చిత్రం అద్భుతంగా చెబుతుంది.
విచిత్రమేమిటంటే, ఏకంగా ఏడు అవార్డులు గెలుచుకున్న ‘ఎవరిథింగ్‌ ఎవరివేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ అనే చిత్రం కూడా భారతీయులకు అత్యంత అభిమానపాత్రమైన, నరనరానా జీర్ణించుకుపోయి ఉన్న ప్రేమ, సానుభూతి, పరస్పర గౌరవాభిమానాలు, అనుబంధాలు, నిరాడంబర జీవితం, అందమైన కుటుంబ జీవితం వంటి అంశాలనే ఇక పటిష్ఠమైన ఇతివృత్తంగా చేసుకుంది. ఇది దక్కించుకున్న ఏడు పురస్కారాలలో ఒక పురస్కారం మిషెల్‌ యో అనే నటికి లభించింది. ఈ ఉత్తమ నటి పురస్కారం అందుకున్న హీరోయిన్‌ ఆసియాకు చెందిన మహిళే. ‘ఈ ఘన విజయాన్ని ప్రపంచంలోని తల్లులందరికీ అంకితం చేస్తున్నా’ అని ఆమె ప్రకటించడం, ‘తనలాంటి సోదర సోదరీమణుల గురించి’ మాట్లాడడం ఆమె అస్తిత్వానికి అద్దం పడుతోంది. తాను ఆసియా దేశస్థురాలినని చెప్పుకోవడానికి ఆమె ఎంత గర్వపడుతున్నదీ ఆమె వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. భారతీయ విజేతలలో కూడా ఇదే విధమైన స్ఫూర్తి వ్యక్తమైంది. నిజానికి వారు ఎక్కడా హాలీవుడ్‌ చిత్రాలను అనుకరించలేదు. పూర్తిగా సొంత గడ్డకు సంబంధించిన ఇతివృత్తంతోనే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని నిర్మించి ప్రపంచం ముందుంచారు.
మొత్తానికి దేశీయ చిత్రాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం కొద్దిగా ఆలస్యంగానైనా ఇప్పుడు లభించినందుకు అంతా ఆనందించాలి. నిజానికి, నాటు నాటు పాట పూర్తిగా తెలుగు చలన చిత్ర రంగానికి సంబంధించిన పాట అని దర్శకుడు రాజమౌళి పదే పదే చెబుతున్నా జిమ్మీ కిమెల్‌ ఈ పాటను బాలీవుడ్‌ పాటగానే అభివర్ణించినప్పటికీ, ఈ పాటకు ఆస్కార్‌ అభించడం నిజంగా తిరుగులేని ఘన విజయమే. ఇది ఎప్పటికీ గర్వ కారణమే. పాశ్చాత్య సినిమా ప్రపంచానికి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం నచ్చిందా లేదా అన్నది పూర్తిగా వ్యక్తం కాలేదు కానీ, వారి చిత్రాలతో పోటీపడగల చిత్రాలు భారత్‌లో నిర్మాణం అవుతున్న విషయం మాత్రం వాళ్లకు కళ్లకు కట్టి ఉండాలి. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. మనం దేశీయ ఇతివృత్తాలతో ఆస్కార్‌ అవార్డులు గెలుచుకోగలం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News