ఆన్‌లైన్ బెట్టింగ్(Online Betting)కు బానిసై ఎంతో మంది యువత తమ సర్వస్వం కోల్పోతున్నారు. మరికొంత మంది అయితే అప్పులు తీర్చలేక ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా యువతను ఈజీ మనీ కోసం బెట్టింగ్‌కు అలవాటు చేసేలా కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రేరేపిస్తున్నారు. ఇందుకోసం రకరకాల వీడియోలు చేస్తూ వారిని ఆకర్షించి బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారు. తాజాగా ఇలాంటి ఆన్‌లైన్ బెట్టింగ్ స్కాంపై అవగాహన కల్పించేలా ఐపీఎస్ అధికారి, టీజీఆర్టీసీ(TGSRTC) ఎండీ వీసీ సజ్జనార్(VC Sajjanar) కొంతకాలంగా పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా లోకల్ బాయ్, ఫిషర్ మెన్‌గా పాపులర్ అయిన నాని ఓ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వీడియోను సజ్జనార్ షేర్ చేశారు. ‘‘మీరు డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఇవేం దిక్కుమాలిన పనులు. మీ టాలెంట్ ను ఇతరత్రా రంగాల్లో ఉపయోగించుకుని సంపాదించుకోవడంలో తప్పులేదు. అలాచేస్తే మిమ్మల్ని సమాజం హర్షిస్తోంది. ఇలాంటి పనుల ద్వారా ఎంతో మందిని బెట్టింగ్ భూతానికి బానిసలను చేయడం ఎంత వరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లమని, మేం ఏం చేసిన నడుస్తుందనే భ్రమలో ఉండకండి. చట్టప్రకారం మీకు శిక్షలు తప్పవని గుర్తుంచుకోండి. ఇప్పటికైనా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్లను ఆపండి’’ అంటూ సూచించారు.