పెద్దగట్టు జాతర ముగిసింది, రెండేళ్ల తర్వాత మళ్లీ జాతర జరగనుంది. మండల పరిధిలోని దురాజ్పల్లి పెద్దగట్టుపై గత 5 రోజులుగా జరిగిన లింగమంతుల స్వామి గట్టు, గొల్లగట్టు, యాదవ గట్టు జాతర గురువారం ముగిసింది. గత ఐదు రోజులుగా గంపల ప్రదక్షిణ, బోనాల చెల్లింపులు, చంద్రపట్నం, స్వామి వారి కల్యాణం, నెలవారం నిర్వహించిన ఆలయ కమిటీ గురువారం మకరతోరణం తరలింపు కార్యక్ర మాన్ని విజయవంతంగా చేపట్టి పూర్తి అయినట్లు ప్రకటించింది.
ముగిసిన జాతర
గత ఐదు రోజులుగా దీపకాంతులతో లింగా ఓ లింగా నామస్మరణలతో, భేరీ చప్పుళ్లు గజ్జల మోతలు, పీకల శబ్దాలు, బూరల మోతతో మారుమోగిన పెద్దగట్టు జాతర గురువారం ఘనంగా ముగిసింది. వందల సంవత్సరాల చరిత్ర గలిగిన పెద్దగట్టు జాతర నేపథ్యంలో ఛైర్మన్ ఉత్సవ కమిటీతో కొనసాగింది. దేవాదాయ శాఖ అధికారులు, యాదవ భక్తులు కలుపుకొని సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలను విజయవంతం చేశారు. ఈ సంవత్సరం భక్తులు సుమారు 20-25లక్షల మంది హాజరై లింగమంతుల స్వామి, చౌడమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు.

మకర తోరణం తరలింపు
పెద్దగట్టు జాతర ప్రారంభానికి ముందు లింగమంతుల స్వామి మకరతోరణం అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. జాతర మొదటి రోజు సూర్యాపేటలోని గొల్లబజార్ నుండి హక్కుదారులు మకరతోరణాన్ని తీసుకువచ్చి లింగమంతుల స్వామికి ప్రతిష్టిస్తారు. ఇక్కడ శివుడు విగ్రహ రూపంలో హాలదారి అయి ఉండడంతో ఈ మకర తోరణం అలంకరణ స్వామికి ప్రత్యేక ఆకర్షణ తెచ్చిపెడుతోంది. దీనితో ప్రతిసారి జాతర ప్రారంభం రోజు మకర తోరణాన్ని సూర్యాపేటలోని హక్కుదారులు ఉత్సాహభరితంగా జాతర ముగిసి దేవరపెట్టి తరలించిన మరుసటి రోజు సాయంత్రం తరలించడం
సంప్రదాయంగా వస్తోంది. ఈసారి కూడా పెద్దలు అదే సంప్రదాయాన్ని పాటించి మకరతోరణం సూర్యాపేటలోనూ హక్కుదారులు ఇంటికి చేర్చారు. దీంతో జిల్లాలో అత్యంత పేరుగాంచిన పెద్దగట్టు జాతర ఉత్సవాలు మగిశాయి.

కొనసాగుతున్న భక్తుల రాక
జాతర ప్రారంభమై ఐదు రోజులవుతున్నా భక్తులు మెల్లమెల్లగా పెద్దగట్టుకు వస్తూనే ఉన్నారు. తక్కువ సంఖ్యలో హాజరవుతున్న భక్తులు, సాయంత్రం కాగానే తండోపతండాలుగా పెద్దగట్టును సందర్శించుకుంటున్నారు. గుట్టపై దేవతామూర్తులకు మొక్కులు చెల్లించి, కింది ప్రాంతంలో ఎగ్జిబిషన్, ఇతర వ్యాపార దుకాణాల్లో షాపింగ్ చేస్తూ సరదాగా గడుపుతున్నారు. దీంతో సాయంత్రమైతే విద్యుత్తు వెలుగుల జిలుగుల్లో ఎగ్జిబిషన్ ప్రాంతం ధగధగలాడుతోంది. ఆలయం పైన ఏర్పాటు చేసిన లైట్లతో పెద్దగట్టు కాంతులీనుతోంది.