వెలిగొండ ప్రాజక్టు పనులను పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసిన ఘనత గత ప్రభుత్వానిదని, ఆ ప్రాజక్టు పూర్తి కావాలంటే దాదాపు రూ.4 వేల కోట్ల నిధులతో పాటు 2 ఏళ్ల సమయం పడుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు.
గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు, 25 లక్షల మందికి త్రాగు నీరు అందజేసే వెలిగొండ ప్రాజక్టు ప్రధాన పనులు ఏవీ పూర్తి చేయకుండా రైతులను గృహనిర్బంధం చేసి పటిష్టమైన బందోబస్తు మధ్య ఆ ప్రాజక్టును జాతికి అంకితం చేశారని ఆరోపించారు. శ్రీశైలం వద్దనున్న హెడ్ రెగ్యులేటరీ, రిటైనింగ్ వాల్ పనులు, మొదటి, రెండవ సొరంగం పనులను, ఫీడర్ కెనాల్ పనులను మరియు నిర్వాశితుల కాలనీల నిర్మాణ పనులను ఏ మాత్రం పూర్తి చేయకుండా వెలిగొండ ప్రాజక్టును జాతికి అంకితం చేశారన్నారు.
డ్రిల్లింగ్-బ్లాస్టింగ్ పూర్తి కాకుండానే
సొరంగం-1 లో 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మేర రోడ్డును మరియు సొరంగం-2 లో 2.00 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టిని తొలగించాల్సి ఉందని, అందుకు దాదాపు తొమ్మిది మాసాలు పడుతుందన్నారు. సొరంగం -2 లో ఇంకా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ చేయాల్సిన పనులు ఉన్నాయని అందుకు దాదాపు ఎనిమిది మాసాలు పడుతుందన్నారు. అదే విధంగా సొరంగం-2 లో 6.8 కి.మి.మేర లైనింగ్ పనులు ఉన్నాయని, భారీ టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా ఉందని, దాన్ని తొలగించేందుకు చాలా సమయం పడుతుందన్నారు. 21.8 కి.మి. మేర ఫీడర్ కెనాల్ పనులను కూడా నిర్వహించాల్సి ఉందన్నారు. ఇన్ని పనులు పెండింగ్ లో ఉంటే వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు.
మాపైన బురదజల్లటం విడ్డూరం
ఈ ప్రాజెక్టు విషయంలో తమ ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ప్రతి పక్షపార్టీ నాయకులు మాట్లాడం వింతగా ఉందన్నారు. 1996 సంవత్సరంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టుకు భూమి పూజ చేసి, 2014 లో రూ.1,373 కోట్లను కేటాయింది అందులో 96 శాతం నిధులు అంటే రూ.1,319 కోట్లను వెచ్చించి 30 శాతం పనులను పూర్తి చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో బడ్జెట్ రూ.3,518 కోట్లు కేటాయిస్తున్నట్లు చూపించినప్పటికీ అందులో కేవలం 18 శాతం నిధులు అంటే రూ.647 కోట్లను మాత్రమే వెచ్చించారన్నారు.