ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా గుండెపోటులు(Heart attack) వస్తున్నాయి. నిలబడ్డవాళ్లు సడెన్‌గా కుప్పకూలిపోతున్నారు. కూర్చున్న వాళ్లు కూర్చున్నట్లే కన్నుమూస్తున్నారు. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ కనిపించినవాళ్లు గుండెపోటుతో పడిపోతున్నారు. తాజాగా ఇలాంటి విషాద ఘటనే తెలంగాణలో చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్తున్నానని బయలుదేరిన విద్యార్థిని నడిరోడ్డుపై కళ్లు తిరిగి పడిపోయింది.
రామారెడ్డి మండలం సిగరాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి(14) కామారెడ్డి(Kamareddy) పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే నడుచుకుంటూ పాఠశాలకు వస్తుండగా జీవధాన్ స్కూల్ వద్ద ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే పాఠశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అయినా సీపీఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. శ్రీనిధి మృతితో సింగరాయిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందడంతో బాలిక కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయింది.