FIFA World Cup 2022 : ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2022లో ఇరాన్ జట్టు బోణి కొట్టింది. వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో విజయం సాధించి ప్రపంచకప్‌లో తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆట అదనపు సమయంలో రూజ్‌బే చేష్మీ (90+9 నిమిషం), రామిన్ రిజయాన్(90+11 నిమిషం)లో చెరో గోల్ చేయడంతో ఇరాన్ అద్భుత విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. వేల్స్ గోల్‌పోస్ట్‌పైకి ఇరాన్ ఆటగాళ్లు పదే పదే దాడులు చేసినా ఫలితం లేకపోయింది. వేల్స్ డిఫెన్స్ విభాగం సమర్థవంతంగా వాటిని అడ్డుకుంది. దీంతో తొలి అర్థభాగంలో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. సెకండాఫ్‌లోనూ దాదాపుగా అదే పరిస్థితి కొనసాగింది. ఆట మరికాసేపట్లో ముగుస్తుందనగా వేల్స్ గోల్ కీపర్ వేన్ హెన్నెస్సీ అత్యుత్సాహం ఆ జట్టు కొంప ముంచింది. ప్రత్యర్థి ఆటగాడిని అడ్డుకునే విషయంలో కాస్త దురుసుగా ప్రవర్తించడంతో రిఫరీ అతడికి రెడ్ కార్డు చూయించాడు. దీంతో వేల్స్ 10 మంది ఆటగాళ్లతోనే మ్యాచ్ కొనసాగించింది. అయినప్పటికీ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. అదనపు సమయంలోనూ గోల్ చేయడంతో విఫలం కావడంతో ఇక మ్యాచ్ దాదాపు డ్రా అనుకుంటున్న తరుణంలో ఇరాన్ ఆటగాళ్లు అద్భుతం చేశారు. 90+9 నిమిషంలో ఇరాన్ ప్లేయర్ రూజ్‌బే చేష్మీ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించి ఖాతా తెరువగా మరో రెండు నిమిషా వ్యవధిలోనే ఆ ఆనందాన్ని డబుల్ చేస్తూ మరో ఇరాన్ ప్లేయర్ రామిన్ రిజయాన్ గోల్ కొట్టాడు. దీంతో ఇరాన్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ లోగా అదనపు సమయం ముగియడంతో మ్యాచ్ ఇరాన్ సొంతమైంది.
తమ తొలి మ్యాచ్‌లో 6-2 తేడాతో ఇరాన్ ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీలో ముందు అడుగువేయాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో గెలిచి రౌండ్ ఆఫ్ 16 ఆశలను సజీవంగా ఉంచుకుంది.