శ్రీశైలం (Srisailam)కి వస్తుండగా దారి తప్పిపోయిన శివ స్వాములను ఎట్టేకేలకు క్షేమంగా తీసుకొచ్చారు పోలీసు, అటవీశాఖ సిబ్బంది. ఈ మేరకు తమను సురక్షితంగా బయటికి తెచ్చినందుకు సిబ్బందికి శివస్వాములు కృతజ్ఞతలు తెలిపారు.
గూగుల్ మ్యాప్ ఆధారంగా శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న శివ స్వాములు అడవిలో తప్పిపోయారు. తెలంగాణ రాష్ట్రం, కొల్లాపూర్, నియోజకవర్గంలోని పెంటవెల్లి గ్రామానికి చెందిన 7 గురు శివ స్వాములు శుక్రవారం ఉదయం పాదయాత్ర ద్వారా శ్రీశైలం బయలుదేరారు.
వారు గూగుల్ మ్యాప్ ను అనుసరిస్తూ ముందుకు సాగారు. అయితే వెళ్లాల్సిన దారిలో కాకుండా మరో మార్గంలో వెళ్లడంతో వారు శుక్రవారం సాయంత్రం 4:00 ప్రాంతంలో వారు దారి తప్పిపోయారు. సాయంత్రానికి దారితప్పిన విషయాన్ని గుర్తించిన శివ స్వాములు భయాందోళనకు గురయ్యారు. దీంతో సెల్ ఫోన్ ద్వారా 100 కు ఫోన్ చేశారు.
నంద్యాల జిల్లా ఎస్పీ స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులను ఆదేశించారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ సిబ్బంది శివ స్వాముల కోసం వెతుకులాట ప్రారంభించారు. చివరికి శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో వారిని గుర్తించి సురక్షితంగా అటవీ ప్రాంతంలో నుంచి బయటకు తీసుకొచ్చారు.
వెంటనే స్పందించిన పోలీస్, అటవీ శాఖ అధికారుల సమయ స్ఫూర్తికి, శివ స్వాములు, స్థానికులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు..