సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు. ఆదివారం శ్రీశైలంలోని హఠకేశ్వరం, కైలాస ద్వారం, కమాండ్ కంట్రోల్ రూమ్, పారిశుద్ధ్యం, 30 పడకల ఆసుపత్రి, మెడికల్ వైద్య శిబిరాలు, తదితర ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హఠకేశ్వరం, కైలాస ద్వారం సమీపాలలో పాదయాత్ర ద్వారా వస్తున్న భక్తులను పరామర్శిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నడక దారిలో మెడికల్ క్యాంపులు ఎలా నడుస్తున్నాయి, ఉచితంగా భోజనాలు అందిస్తున్నారా, త్రాగునీటి సదుపాయం ఎలా ఉన్నాయనే విషయాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. నడక దారిలో ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా, పారిశుద్ధ్యం ఎలా ఉంది, కల్పించిన సౌకర్యాలపై ఆరా తీస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం శ్రీశైల దేవస్థాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలిస్తూ కంట్రోల్ రూమ్ ఎలా పనిచేస్తుంది, ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ఎలా కోఆర్డినేట్ చేసుకొని సమస్యను పరిష్కరిస్తున్నారు తదితర అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

తదుపరి 30 పడకల ఆసుపత్రిని పరిశీలించి నడుచుకుంటూ వచ్చి హాస్పిటల్లో చేరిన పేషంట్లను పరామర్శిస్తూ ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతూ ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 11 జోన్లుగా విభజించిన శ్రీశైల క్షేత్రం అంతటా పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
