Sunday, February 23, 2025
HomeతెలంగాణSLBC rescue ops: ఆ ఎనిమిది మందిని కాపాడడం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాం

SLBC rescue ops: ఆ ఎనిమిది మందిని కాపాడడం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాం

సహాయక చర్యలకు ఆటంకం

ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

సురక్షితంగా సహాయ చర్యలు

రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీ, నేవీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) ఇతర ఏజెన్సీలు సమిష్టిగా పనిచేస్తున్నాయని, వేగంగా, సురక్షితంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. డీ వాటరింగ్ ప్రక్రియ ప్రారంభమైందని, టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల కోసం నిరంతరం ఆక్సిజన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. “ఆర్మీ, నేవీ, NDRF ప్రతినిధులతో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించాం. టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని రక్షణ చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

పరిస్థితి తీవ్రంగా ఉంది

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడామన్నారు. రాహుల్ గాంధీ ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి తాజా సమాచారం కోరగా, ప్రధాని మోదీ ఇప్పటికే ఆయన్ను సంప్రదించి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ప్రమాద స్థలంలో పరిస్థితి తీవ్రంగా ఉందని, నీటి ప్రవాహం సహాయ చర్యలకు ఆటంకం కలిగిస్తుందన్నారు. నీటి నిల్వలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, టన్నెల్ లోని మట్టి దిబ్బలను తొలగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నామని వివరించారు.

అకస్మాత్తుగా నీరు

“టన్నెల్ లోని సహజ రాతి నిర్మాణాలు సడలడంతో అకస్మాత్తుగా నీరు, మట్టి ప్రవహించాయన్నారు. దాంతో టన్నెల్ లో 12-13 అడుగుల వరకు నీరు నిండిపోయిందన్నారు. ఇది అత్యంత క్లిష్టమైన పరిస్థితి, దీనిని పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు,” అని ఆయన వివరించారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రమాద ప్రాంతం భౌగోళికంగా క్లిష్టమైన ప్రదేశం కావడంతో భారీ యంత్రాలను అక్కడికి చేర్చడం కష్టంగా మారిందని తెలిపారు. అయినప్పటికీ, అధికారులు ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంభించి మట్టి డిబ్బేలు తొలగించేందుకు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

నిరంతరం ఆక్సిజనం పంపిణీ

నీటిపారుదల శాఖ, విపత్తు నిర్వహణ బృందాలు, రక్షణ దళాలు సంయుక్తంగా సహాయ చర్యలు నిర్వహిస్తున్నాయని, నిరంతరం ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతోందని, డీ వాటరింగ్ కోసం మోటార్లు వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు.

ప్రమాదం జరిగినప్పటి నుండి, ప్రభుత్వం సహాయ చర్యల్లో నిమగ్నమై ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం జరిగిన ప్రమాదాన్ని తెలిసిన వెంటనే, తాను సంఘటన స్థలానికి చేరుకున్నానని, విపత్తు నిర్వహణ బృందాలు, ఆర్మీ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులతో చర్చలు నిర్వహించి, తక్షణమే NDRF, SDRF బృందాలను రంగంలోకి దింపేలా చర్యలు తీసుకున్నానని వివరించారు.

శనివారం రాత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయ చర్యల వ్యూహాన్ని సమీక్షించారని తెలిపారు. ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బోజ్జా, NDRF మరియు SDRF అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, పురోగతిని అంచనా వేసి, అవసరమైన సూచనలు అందించామని ఆయన చెప్పారు.

ఆదివారం ఉదయం తిరిగి సంఘటన స్థలానికి చేరుకుని, ఇంజినీరింగ్ అధికారులు, టన్నెల్ ప్రాజెక్టుకు బాధ్యత వహించే కాంట్రాక్టింగ్ ఏజెన్సీతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించామన్నారు. సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ప్రమాద స్థలానికి చేరుకున్నారని తెలిపారు.

రాజకీయాలు వద్దు

SLBC టన్నెల్ ప్రమాదాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్న BRS నాయకత్వాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పదేళ్లుగా SLBC ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన BRS ప్రభుత్వం ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ఆయన ఆరోపించారు. “BRS ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పదేళ్ల పాటు పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం బాద్యతను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

కమీషన్లే ప్రాధాన్యంగా చూసిన వాళ్లు మీరే

ప్రాజెక్ట్ నిర్వహణ కంటే కమీషన్లను ప్రాధాన్యంగా చూసిన వారు, ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. టన్నెల్ నిర్మాణంలో లీకేజీల ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. గతంలో BRS హయాంలో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. సమస్యకు పరిష్కారం చెప్పడానికి బదులుగా, అసంబద్ధమైన రాజకీయ విమర్శలు చేస్తున్నారు,” అని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం కార్మికుల ప్రాణాలను రక్షించడానికే అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, సంక్షోభ సమయంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని BRS నాయకులు మానుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హితవుపలికారు.

“మేము ప్రాణాలను రక్షించడంపై దృష్టి సారిస్తున్నాము. ఈ కీలక సమయంలో, అందరూ సహాయ చర్యలకు మద్దతుగా ఉండాలి. బదులుగా, నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి,” అని ఆయన ఉద్బోధించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News