రాజన్న భక్తులకు శీఘ్ర దర్శనం కలిగేలా మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన తెలంగాణ ప్రజల ఇలవేల్పు వేములవాడ రాజన్న ఆలయం ఈనెల 25, 26, 27 తేదీలలో జరిగే మహా శివరాత్రి జాతర ఏర్పాట్లను ఉత్సవ కమిటీ సభ్యులతో కలసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు,గుడి చెరువు వద్దనున్న మైదానంలో ఏర్పాట్లు, శివార్చన స్టేజ్, ధర్మగుండం, క్యూ లైన్ లను పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఈ జాతరకు తరలి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. భక్తులకు చలవ పందిళ్ళు, త్రాగు నీటి వసతి, ఏర్పాటు చేయాలని సూచించారు.