సోషల్ మీడియాలో మహా కుంభమేళాపై తప్పుడు రాతలు రాసిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈమేరకు ఇప్పటికే 140 సోషల్ మీడియా హ్యాండిల్స్ పై కేసులు నమోదు చేసి, తదుపరి చర్యలను చేపట్టే పనుల్లో యూపీ సర్కారు ఉంది. ఇప్పటికే వీటిపై 13 ఎఫ్ఐఆర్ లు కూడా నమోదు చేసినట్టు కుంభ్ మేళా డిప్యుటీ ఇన్స్పెక్టర్ జనరల్ వైభవ్ కృష్ణా వెల్లడించారు.
కుంభమేళాపై తప్పుడు రాతలు రాసి, ప్రజలను తప్పుదోవ పట్టించి, భయబ్రాంతులకు గురిచేసే వీడియోలు, ఫోటోలు, టెక్ట్స్ తోపాటు ఫేక్ న్యూస్ ను వీరు వైరల్ చేసే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలున్నాయి.
620 మిలియన్ల మంది ప్రయాగ్ రాజ్ లోని త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించినట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిన్న ప్రకటించారు. మహా శివరాత్రికి పోటెత్తనున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినట్టు యోగి వివరించారు. శివరాత్రితో మహా కుంభమేళా ముగింపుకు చేరుతుంది, దీంతో పుణ్య స్నానాలకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు.