ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్(IND vs PAK ) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన కింగ్ విరాట్ కోహ్లీ(Virat Kohli) పలు రికార్డులను తన ఖాతాలో వేపుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్న విషయం విధితమే. దీంతో వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 15 పరుగుల వద్ద వన్డేల్లో 14వేల పరుగుల మైలురాయిని కోహ్లీ చేరుకున్నాడు. దాంతో వన్డేల్లో అత్యంత వేగంగా 14000 పరుగులు చేసిన ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 350 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకోగా కోహ్లీ కేవలం 287 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు(27,503) చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ (27,483పరుగులు)ను అధిగమించాడు. ఈ జాబితాలో 34,357 పరుగులతో సచిన్ అగ్రస్థానంలో ఉండగా.. 28,016 పరుగులతో సంగక్కర రెండో స్థానంలో ఉన్నాడు.
పాక్‌పై చేసిన సెంచరీ విరాట్ కోహ్లీకి వన్డేల్లో 51వ సెంచరీ. మూడు ఫార్మాట్లలో కలిపి 82వ శతకం. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్(100) పేరిట ఉంది. ఇక వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత ఫీల్డర్‌గానూ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రెండు క్యాచులు అందుకోవడంతో మాజీ కెప్టెన్ అజారుద్దీన్(156) రికార్డును బ్రేక్ చేశాడు. కోహ్లీ ప్రస్తుతం 157 క్యాచ్‌లతో తొలి స్థానంలో ఉన్నాడు.
