నంద్యాల జిల్లా శ్రీశైలం(Srisailam) మహా క్షేత్రంలో ఆరవ రోజు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఈ రోజు శ్రీ స్వామి అమ్మవార్లను రాష్ట్ర గవర్నర్ దంపతులు దర్శించుకోనున్నారు. సాయంకాలం పుష్ప పల్లకీసేవ – గ్రామోత్సవం లోక కల్యాణం కోసం రుద్రహోమం, చండీహోమం, జపాలు, పారాయణలు నిర్వహించనున్నారు. గ్రామోత్సవంలో పలు సంప్రదాయ జానపద కళారూపాల ప్రదర్శన ఉంటుంది.
మయూర వాహనంపై
5వ రోజు మయూర వాహన సేవపై భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. ఆలయం విద్యుత్ దీపాల కాంతిలో భక్తులకు అపూర్వ అనుభూతిని కలిగించింది. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. అర్చకులు, వేద పండితులు మహా శివరాత్రి ఉత్సవాల ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, సహస్రనామార్చనలు నిర్వహించి స్వామి అమ్మవార్లకు విశేష సేవలు అందించారు.
అనంతరం భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంపై ఆసీనులుగా ఏర్పాటుచేసి అర్చకులు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు సమర్పించారు. భక్తులు ఈ అపురూప దర్శనాన్ని ఆస్వాదిస్తూ స్వామి కృపకు పాత్రులయ్యారు.
విద్యుత్ దీప కాంతులతో
రాత్రి వేళ, విద్యుత్ దీపాల కాంతుల్లో స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. ప్రధాన ఆలయ రాజగోపురం గుండా మయూర వాహనంపై స్వామి అమ్మవార్లకు ఊరేగింపు చేస్తుండగా, భక్తులు “హర హర మహాదేవా” నినాదాలతో మారుమ్రోగింది.
వైభవంగా గ్రామోత్సవం
భజా, భజంత్రీల మధ్య ఆలయ ప్రదక్షిణ అనంతరం, ఊరేగింపు గ్రామోత్సవంగా వైభవంగా నిర్వహించబడింది. బ్యాండ్ వాయిద్యాలు, పురాణ గీతాలు, భక్తి పాటల నడుమ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ముందు కళాకారుల నృత్య ప్రదర్శనలు, ఆటపాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఇతర అధికారులు, పెద్దఎత్తున భక్తులు పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు.