ఏపీ అసెంబ్లీ(AP Assembly) బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యుల నినాదాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)మండిపడ్డారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. సభలో వైసీపీ నేతల తీరు బాగోలేదన్నారు. వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయని, అయినప్పటికీ ప్రతిపక్ష హోదా అడుగుతోందని సెటైర్లు వేశారు. వైసీపీకి ఈ ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా రాదని తేల్చి చెప్పారు.

పవన్ కళ్యాణ్ ఇంకా ఏమన్నారంటే..
“ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ 11 సీట్లు మీకు వచ్చాయి. దాన్ని గౌరవించి సభకు రండి. ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదు. ప్రశ్నోత్తరాల సమయంలోనూ వైసీపీకి అవకాశం వస్తుంది. ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవలన్నది లో లెవెల్ ఆలోచన. ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించండి. ప్రతిపక్ష హోదా ఈ ఐదేళ్లలో మీకు రాదు. 11 సీట్లతో ఆ హోదా రాదు. ఇది చంద్రబాబు, జనసేన నిర్ణయం తీసుకునే విషయం కాదు. దానికి రూల్స్ ఉంటాయి.


11 సీట్లతో ప్రతిపక్ష హోదా రావాలని అనుకుంటే వారు జర్మనీకి వెళ్లిపోవాలి. జర్మనీలో రూల్స్ వేరేలా ఉంటాయి. అసెంబ్లీ స్థానాలను బట్టి 5 శాతం కంటే తక్కువ ఓట్లు వస్తే ఆ ఓట్ల శాతాన్ని మిగతా వాళ్లు పంచుకుంటారు. ఇలాంటి రూల్స్ ఇండియాలో లేవు. అయినప్పటికీ ప్రతిపక్ష హోదా కావాలని వైసీపీ నేతలు మంకిపట్టుపడితే వారు జర్మనీకి వెళ్లిపోవచ్చు” అని ఎద్దేవా చేశారు.