అసెంబ్లీ సమావేశాల(AP Assembly)కు హాజరుకాకూడదని వైసీపీ అధినేత జగన్(YS Jagan) నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేదని తెలిపారు. అందుకే అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు.
అసెంబ్లీకి వెళ్లినా, వెళ్లకున్నా ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. తానింకా 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని.. తనతో పాటు ఉండేవాళ్లు మాత్రమే తన వాళ్లన్నారు. 2028 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటున్నారని.. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలకు తోడుగా, ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టేనని చెప్పారు. ప్రజాసమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దని తెలిపారు.