తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మార్చి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 10 వరకు నామినేషన్‌ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13 వరకు గడువు విధించింది. మార్చి 20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ అనంతరం అదే రోజు కౌంటింగ్ చేపడతారు. కాగా మార్చి 29వ తేదీతో ఏపీలో ఐదుగురు, తెలంగాణలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. దీంతో ఆయా స్థానాలకు ఎన్నిక జరగనుంది.
ఏపీ నుంచి జంగా కృష్ణమూర్తి, దువ్వరపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బి. తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడు.. ఇక తెలంగాణ నుంచి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గే మల్లేశం, రియాజుల్ హుస్సేన్ పదవీకాలం ముగియనుంది.