SLBC టన్నెల్ కుప్పకూలిన ప్రాంతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వెళ్లకపోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) కౌంటర్ ఇచ్చారు. ఓ వైపు ఎనిమిది మంది ప్రాణాపాయ స్థితిలో ఉంటే కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతల విమర్శలు విడ్డూరమని మండిపడ్డారు. ఈ ఘటనపై రాజకీయ విమర్శలు చేస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మంత్రులు ఇక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
సహాయక చర్యలకు ఇబ్బందులు రావొద్దనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడకు రాలేదని స్పష్టం చేశారు. కానీ కేటీఆర్ రాలేదని విమర్శలు చేయడం సరికాదని విమర్శించారు. సిరిసిల్లలో, కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రమాదం జరిగినప్పుడు కేటీఆర్ వెళ్లారా? అని ప్రశ్నించారు. సిక్కిం, ఝార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను ప్రాణాలతో బయటకు రావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. కార్మికులను కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రంగంలోకి దిగిందని వెల్లడించారు.