వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi)పై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేసేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ మైనింగ్ సహా భూకబ్జాలపై విచారణకు నలుగురితో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనికి జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వం వహించనున్నట్లు పేర్కొంది.
కాగా గన్నవరం టీడీపీ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వంశీని విచారించేందుకు మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే కోర్టు కొన్ని షరతులు విధించింది. న్యాయవాది సమక్షంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని తెలిపింది. మరోవైపు వెన్ను నొప్పితో బాధపడుతున్న వంశీకి పడుకోవడానికి బెడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.