కుంభమేళా ఏర్పాట్లు అధ్యయనంలో మంత్రి నారాయణతో పాటు అధికారుల బృందం నిమగ్నమైంది. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేసిన తీరుతెన్నులను వీరు కూలంకుషంగా అధ్యయనం చేస్తున్నారు.

ప్రయాగ రాజ్ చేరుకున్న మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ భద్రత, పరిశుభ్రత, కనీస సదుపాయాల కల్పన వంటి అన్ని మౌలిక ఏర్పాట్లపై లోతైన అధ్యయనం చేస్తున్నారు.

గోదావరి పుష్కర ఏర్పాట్ల కోసం
2027 లో ఏపీలో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం కుంభమేళాలో అధ్యయనం చేస్తున్నారు మంత్రి, అధికారులు. ఈ సాయంత్రం ప్రయాగ రాజ్ లో కుంభమేళా అధారిటీ ఆఫీసును సందర్శించిన బృందం వారితో పలు విషయాలపై చర్చించి, సందేహాలు నివృత్తి చేసుకున్నారు. కుంభమేళా ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు గురించి మంత్రి బృందానికి ప్రజెంటేషన్ ఇచ్చిన కుంభమేళా ఆఫీసర్ విజయ్ కిరణ్ ఆనంద్. కుంభమేళా అధారిటీ కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలించారు మంత్రి, అధికారులు. స్నాన ఘాట్ల వద్ద ఏర్పాట్లను అక్కడి అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి నారాయణ బృందం.


