రాజన్న భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మహా శివరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి రాజరాజేశ్వర దేవస్థానంలో అన్నదాన సత్రం, రాజన్న జల ప్రసాదాన్ని పరిశీలించారు. అన్నదాన సత్రంలో వంట గది పరిశీలించారు. భక్తులను వారి యోగక్షేమాలు, అన్నం-కూరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. జల ప్రసాదం వద్ద ఓపెన్ డ్రైన్ ను పూడ్చాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో శానిటేషన్ ఎప్పటికప్పటికప్పుడు చేయాలని తెలిపారు. అనంతరం బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
ఈ నెల 25, 26, 27 తేదీల్లో జరుగు మహా శివరాత్రి జాతరకు దేశం నలుమూలల నుండి తరలివచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, దేవాలయ పరిసర ప్రాంతాలను, దర్శన ప్రదేశాలు, ధర్మగుండం, శివార్చన జరుగు ప్రదేశం, వీఐపీ పార్కింగ్, జనరల్ పార్కింగ్ ప్రదేశాలను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. భారీ కేటింగ్ ఏర్పాటు చేయాలని, భారీ సంఖ్యలో వచ్చే వాహనాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్స్, వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

ఎస్పీ వెంట పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఆలయ ఈఓ వినోద్, ఈఈ రాజేష్, డిఈ మైపాల్ రెడ్డి, ఏఈ రామ్ కిషన్ రావు, ఏఈఓలు శ్రవణ్ కుమార్, జి అశోక్ కుమార్, ఆలయ సిబ్బంది ఉన్నారు.

ఏర్పాట్లు పరిశీలించిన ధర్మకర్తలు
మహా శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ దేవస్థానం ధర్మకర్తలు వివిధ శాఖలలో శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించారు. లడ్డు, పులిహోర తయారీ విభాగం, కోడేల క్యూలైన్, లడ్డు కౌంటర్, ధర్మగుండం పరిసర ప్రాంతాలను పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తుల నుండి విఐపిల వరకు ఏలాంటి అసౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా భక్తులకు, అధికారులకు మధ్యలో ధర్మకర్తలు అనుసంధానం చేసుకుంటూ శివరాత్రి మహోత్సవాన్ని దిగ్విజయంగా జరుపుకోవాలని ధర్మకర్త, కాంగ్రెస్ బ్లాక్ సాగరం వెంకటస్వామి అన్నారు.