నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో వెలసిన శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం శివపార్వతులు ఏకశిలపై వెలసిన ఏకైక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఎర్రమల పర్వత సానువుల మధ్య ప్రకృతి సోయగాలతో భక్తులతో పాటు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మహా శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు క్షేత్రాన్ని దర్శించుకునేందుకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాలతో ఈఓ బి చంద్రుడు అధికారులతో కలిసి ముమ్మర ఏర్పాట్లు చేశారు.
యాగంటి క్షేత్రం చరిత్రను పరిశీలిస్తే
చిట్టెప్ప అనే శివ భక్తుడు శివుని కొరకు తపస్సు చేశాడు. శివుడు ఒక పులిలాగ ఆయనకు కనబడతాడు. అపుడు పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమైనాడని గ్రహించిన చిట్టెప్ప “నేగంటి శివుని నే కంటి” అంటూ ఆనందంతో నృత్యం చేశాడు. అదే పేరు వాడుకలో యాగంటి అయింది అంటారు. బ్రహ్మం నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. యాగంటి ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శివుడు, పార్వతి, నంది ఈ ఆలయంలోని దేవతామూర్తులు. ఇక్కడ శివపార్వతులు ఇద్దరూ ఒకే లింగంలో కనిపిస్తారు.

స్థల పురాణం :
ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్త్య మహా ముని ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించాలని తలపెట్టారు. కానీ ప్రతిష్ఠించదలిచిన విగ్రహం కాలి బొటన వ్రేలు గోరు విరగడం వల్ల స్వామి వారిని ప్రతిష్ఠించ లేదు. నిరాశకు లోనై ముని శివుని కొరకు తపస్సు చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై స్థలం కైలాసాన్ని పోలి వున్నందున శివ లింగం ప్రతిష్ఠించమని చెబుతాడు. అపుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడిని ప్రతిష్ట చేశారు.
యాగంటి బసవణ్ణ ప్రత్యేక ఆకర్షణ:
బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో కలియుగాంతంలో ఆలయం ముందున్న నందీశ్వరుడు కాలు దువ్వి రంకె వేస్తాడని, అది భూమండలం దద్దరిల్లేలా ఆ రంకె వుంటుందని పేర్కొన్నారు. బసవయ్య అంటే శివుడి వాహనమైన నందీశ్వరుడు. ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ప్రతి ఇరవై సంవత్సరములకు ఒక అంగుళం పెరుగుతాడు. ఈ విధంగా పెరిగే సరికి ప్రస్తుతం ఈ నంది మండపం పరిధిని దాదాపుగా ఆక్రమించుకుంది. 400 ఏళ్ల కిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండేదని, భక్తులు దాని చుట్టు ప్రదక్షిణలు కూడా చేసేవారని చెబుతుంటారు. ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావడం లేదని అంటారు. నంది విగ్రహ పెరుగుదలని పురావస్తు శాస్త్రజ్ఞులు నిర్థారించారు.

శనికి వాహనమైన కాకులకు ప్రవేశం లేదు
అగస్త్య మహాముని ఈ క్షేత్రంలో శివుని కోసం యాగం చేసేటప్పుడు రాక్షసులు కాకి రూపంలో వచ్చి మాంసం ముక్కలు యాగాగ్నిలో వేస్తున్నారని కాకులు ఈ క్షేత్రంలో తిరగరాదని అగస్త్యుడు శపించాడట. అందుకే ఈ క్షేత్రంలో కాకులు ఉండవు. శనికి వాహనం కాకి ఇక్కడ కాకిని నిషేధించారు కాబట్టి ఇక్కడ నేను ఉండను అని అయన చెప్పాడంట అందుకే ఈ గుడిలో నవగ్రహాలు ఉండవు. ఆ ప్రదేశంలో నందీశ్వరుడు ఉంటాడు.
అగస్త్య పుష్కరిణి:
ఆలయ ప్రాంగణంలో ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలోని కోనేరు లో చేరుతుంది. ఏ కాలంలో నైనా కోనేరు లోని నీరు ఒకే మట్టంలో వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని భక్తుల నమ్మకం.
ఆలయానికి ఉత్తరాన శ్రీ అగస్త్య మహాముని వారి గుహ, ఆలయ ముఖద్వారానికి ఉత్తరాన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ, పుష్కరిణికి ఉత్తరాన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుహ వున్నాయి.

శ్రీ అగస్త్య మహాముని గుహ:
ఈ గుహలో శ్రీ అగస్త్య మహాముని వారు తపస్సు చేసినట్లు చెబుతారు. ఈ గుహలోకి వెళ్ళడానికి 120 నిటారు మెట్లు వుంటాయి. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం, ఆదిశేషుని ఆకారాలు పడమటి వైపు కనిపిస్తాయి.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ:
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం మొలిచే సమయంలో కాలి బొటనవేలు గోరు విరిగింది. ఈ విధమైన అసంపూర్ణ విగ్రహం పూజలనందు కొనకూడదు. అందువల్ల ఈ విగ్రహాన్ని ఈ గుహలో శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడు.
ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణానికి ముందే ప్రతిష్టించారని అంటారు. శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాల ఙ్ఞానంలో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని రాశారని చెబుతారు.

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ :
ఈ గుహలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాల ఙ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ, రోకళ్ళ గుహ అనికూడా అంటారు.
మహా శివరాత్రి రోజు శివ పార్వతులను దర్శించుకోవడానికి జిల్లా నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున క్షేత్రానికి భక్తులు తరలివస్తారు. భక్తుల సౌకర్యం ఆలయ కార్య నిర్వహణ అధికారి చంద్రుడు అన్ని ఏర్పాట్లు చేశారు..
ఎలా చేరుకోవాలి?
యాగంటి క్షేత్రం నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణానికి పడమటి దిక్కున సుమారు 12 కి.మీ.ల దూరంలో ఉంది. కర్నూలుకు దాదాపు 100కి.మీ.ల దూరంలో, నంద్యాలకు 56 కి.మీ, బెలుం గుహలకు సుమారు 45కి.మీ.ల (1.5గంటల ప్రయాణం) దూరంలో ఉంది). బనగానపల్లె నుండి యాగంటి క్షేత్రానికి ఆర్టీసీ వారు ప్రత్యేక ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు.