ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. అయితే సోమవారం గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Ayyanna patrudu) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎంగా పనిచేసిన జగన్ సభ్యత మరిచి ప్రవర్తించారని విమర్శించారు. తన పార్టీ సభ్యుల తీరును నియంత్రించాల్సింది పోయి కూర్చుని నవ్వుకుంటారా? అని నిలదీశారు. ఆయన వ్యవహరించిన తీరు ప్రజలు అసహ్యించుకునేలా ఉందన్నారు. బొత్స వంటి సీనియర్ నేత పక్కనే ఉండి కూడా జగన్ ఇది తప్పని చెప్పలేదని ఆక్షేపించారు. ఇకనైనా జగన్ విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. అసెంబ్లీకి అతిథిగా వచ్చిన గవర్నర్‌ను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పీకర్ వెల్లడించారు.
మరోవైపు తప్పుడు కథనాలు ప్రచురించిన ఓ మీడియా సంస్థకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని స్పీకర్ నిర్ణయించారు. సభా హక్కుల కమిటీకి ఆ పత్రిక కథనాలను రిఫర్ చేశారు. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు జరగకుండా రూ.కోట్లు వెచ్చించారంటూ తప్పుడు కథనం రాశారని నందికొట్కూర్ ఎమ్మెల్యే జయసూర్య సభ దృష్టికి తీసుకొచ్చారు. సదరు మీడియాపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన ఫిర్యాదుతో చర్యలు తీసుకోవాలని సభా హక్కుల కమిటీకి స్పీకర్ సూచించారు.