తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, సినీ నటి మాధవీలత(Madhavi Latha) మధ్య వివాదం పలు మలుపులు తిరుగుతూనే ఉంది. ఇప్పట్లో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. ఇప్పటికే మాధవీలత ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలోని తాడిపత్రి పోలీసులు మాధవీలతపై కేసు నమోదు చేశారు.
కాగా కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తాడిపత్రి మహిళలకు ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌పై మాధవీలత స్పందిస్తూ… జేసీ పార్క్ వైపు మహిళలు వెళ్లవద్దని సూచించారు. అక్కడ దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై జేసీ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. మాధవీలతపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ఆయన వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పారు.
అయితే న్యూఇయర్ వేడుకల వేళ మాధవీలత చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని మాల మహానాడు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కొంకణి కమలమ్మ తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు మాధవీలతపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తానికి ఈ వ్యవహారంలో ప్రభాకర్ రెడ్డి, మాధవీలతపై పోలీసు కేసులు నమోదయ్యాయి.