కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ముఖ్యమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. ఈ పథకాలను ఏప్రిల్, మే నెల నుంచి అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పెన్షన్ సక్రమంగా పెంచకుండా, ఏడాదికి కేవలం రూ.250 చొప్పున పెంచడం దురదృష్టకరమని విమర్శించారు. మిగిలిన పథకాలను 2020లో అమలు చేశారని గుర్తు చేశారు.
తమ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను నిర్ధిష్ట సమయానికి అమలు చేసి, ప్రజలకు భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ఊరటనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా తల్లికి వందనం పథకం కింద ప్రతి తల్లికి రూ.15,000, అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20,000 అందిస్తామని హమీ ఇచ్చిన సంగతి తెలిసిందే.