రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన ఆర్థిక అక్షరాస్యత వారంలో భాగంగా పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈనెల 24 నుంచి 28 వ తేదీ వరకు రిజర్వ్ బ్యాంక్ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమన్వయంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2K వాకథాన్ నిర్వహించింది. ఈ వాకథాన్‌లో విశ్వవిద్యాలయ విద్యార్థులతో పాటు, దాదాపు 400 మంది ప్రముఖులు, కార్యనిర్వాహకులు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
వాకథాన్ తర్వాత సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ డిప్యూటీ జనరల్ మేనేజర్ టి జగదీష్ కుమార్, ఈ ఏడాది మహిళా శ్రేయస్సునే థీమ్ తో తాము అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. గృహిణులను లక్ష్యంగా చేసుకుని ఆర్థిక ప్రణాళిక, పొదుపు, రిస్క్ నిర్వహణ, శ్రామిక మహిళలను లక్ష్యంగా చేసుకుని వృద్ధికి క్రెడిట్‌ను పొందడం వంటి అంశాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నందుకు రిజర్వ్ బ్యాంక్ సహా అన్ని సభ్య బ్యాంకులను ఎస్బీఐ జనరల్ మేనేజర్-ఎల్ఎస్బీసీ తెలంగాణ కన్వీనర్ ప్రకాష్ చంద్ర బరోర్ అభినందించారు. బ్యాంకుల చురుకైన భాగస్వామ్యంతో ఆర్థిక అక్షరాస్యత వారం లక్ష్యాలు సాధించగలమని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.