నంద్యాల జిల్లా శ్రీశైలం(Srisailam)మహా క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు(Sivaratri Bramhostavalu) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీశైలం మెుత్తం భక్త జనసంద్రంగా మారిపోయింది. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం, ప్రధాన వీధులు, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పగాలంకరణ మహోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని భవ్యంగా అలంకరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. నాద స్వరాలు, వేణుగానంతో ఆలయ ప్రాంగణం మంత్రోచ్ఛారణలతో మారుమోగుతుంది. రాత్రి జాగరణకు భక్తులు సిద్ధమవుతుండగా, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నందివాహన సేవ
శివరాత్రి ప్రత్యేక పూజల సందర్భంగా మంగళవారం శ్రీ మల్లికార్జున స్వామివారికి నందివాహన సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించగా, భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆధ్మాత్మిక పారవశంలో మునిగితేలారు.
భద్రత ఏర్పాట్లు
భక్తుల రద్దీ కారణంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు, సీసీ కెమెరాల ద్వారా నిఘా పెంచారు.పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో పాతాళగంగ చేరుకుంటున్నారు.
శివనామస్మరణతో
పదహారుల గుడి, శిఖర దర్శనం వద్దనూ భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల సౌకర్యార్థం ఉచిత అన్నదానం, తాగునీటి సౌకర్యం, వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగిపోతుండగా, భక్తుల హర్షధ్వానాలు వినిపిస్తున్నాయి.
పూర్ణాహుతితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాలు మార్చి 1న పూర్ణాహుతితో ముగియనున్నాయి. ఈ చివరి రోజున రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికారులు భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు, స్వామివారి అనుగ్రహాన్ని పొందేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.