తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఢిల్లీ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సెటైర్లు వేశారు. 36 సార్లు ఢిల్లీకి పోయిన రాష్ట్రానికి 3 రూపాయలు తెచ్చింది లేదని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.
“ఎస్‌ఎల్‌బీసీ సొరంగం (SLBC tunnel) కూలి ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుంటే.. ఎన్నికల ప్రచారంలో మునిగి తేలావ్. మూడు నెలలుగా జీతాల్లేక అల్లాడుతున్నామని కార్మికులు వాపోతుంటే.. ఎన్నికల ప్రచారం ముగించుకుని నిమ్మలంగా మళ్లీ హస్తిన బాటపట్టావ్. సొరంగంలో సహాయక చర్యలు ఒక్క అడుగు ముందుకు.. వంద అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది. అక్కడ ఆక్సిజన్ లేదు.. కన్వేయర్ బెల్ట్ తెగిపోయింది. 96 గంటలు దాటినా ఒక్కడుగూ ముందుకు పడడం లేదు.
కాళేశ్వరం పర్రెల మీద శ్రీశైలం అగ్నిప్రమాదం మీద కారు కూతలు కూసి.. విషపు రాతలు రాసిన మేధావుల నోళ్లు ఎస్‌ఎల్‌బీసీ విషయంలో మాత్రం నోరెత్తడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి హస్తిన యాత్రలు మాని.. కార్మికుల గోడు వినండి. ఆ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వండి. అక్కడ చిక్కుకున్నవి సాధారణ ప్రాణాలు కాదు.. ఈ జాతి సంపద” అని రాసుకొచ్చారు. కాగా కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే.