నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) సినీ కెరీర్‌లో ‘ఆదిత్య 369′(Aditya 369) సినిమా ఓ మైలురాయి చిత్రంగా నిలిచిపోతుంది. 1990ల్లోనే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఇది రికార్డు సృష్టించింది. దింవగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీ దేవి మూవీస్ సంస్థ బ్యానర్ మీద శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను అప్పట్లోనే భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం, బాలయ్య నటన సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది.
ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలుగా బాలయ్య లుక్, డైలాగులు అభిమానులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక జంధ్యాల సంభాషణలు, ఇళయరాజా సంగీతం, అబ్బుర పరిచే సెట్స్, ఫైట్స్, కాస్ట్యూమ్స్, డ్యాన్సులు ఇలా ప్రతీ ఒక్కటి మంత్రముగ్థులను చేసింది. చరిత్రలో నిలిచిపోయిన ఈ చిత్రం ఇప్పటికీ టీవీలో వస్తే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. అలాంటి సినిమాను రీరిలీజ్ చేసేందుకు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సిద్ధమయ్యారు. మహా శివరాత్రి సందర్భంగా ఈమేరకు అధికారిక ప్రకటన చేశారు.

“ఆదిత్య 369 తొలిసారి విడుదల సమయంలో ఎంత ఉత్సాహంగా, ఆసక్తిగా ఉన్నానో ఇపుడు రీరిలీజ్ సందర్భంగా కూడా అలాగే ఉన్నాను. ఎన్ని సార్లు చూసినా కనువిందు చేసే ఈ ట్రెండ్ సెట్టింగ్ చిత్రాన్ని డిజిటల్ 4Kలో ఇంకా అద్భుతంగా తీర్చదిద్దాము. అన్ని వయసులు, వర్గాల ప్రేక్షకులని, నందమూరి అభిమానులను అలరించిన ఈ చిత్రాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో మంచి చిత్రాలు తెరకెక్కించిన మా నిర్మాణ సంస్థకి ఒక గొప్ప గుర్తింపు, అద్భుతమైన పునాది వేసింది ‘ఆదిత్య 369’. ఈ వేసవి కాలంలో మరోసారి గ్రాండ్‌గా రీరిలీజ్ చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నాం” అని ఆయన తెలిపారు.
