సినీ నిర్మాత కేదార్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ సన్నిహితులందరూ అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారని తెలిపారు. కేటీఆర్(KTR) వ్యాపార భాగస్వామి, నిర్మాత కేదార్ దుబాయ్‌లో అనుమానస్పదంగా చనిపోయారని.. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఏ4గా ఉన్న న్యాయవాది సంజీవరెడ్డి కూడా మృతి చెందారని.. మేడిగడ్డ బ్యారేజీపై కోర్టులో కేసు వేసిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యారని చెప్పారు. ఈ మరణాల వెనక మిస్టరీ ఏమిటో కేసీఆర్, కేటీఆర్‌లకే తెలియాలని సంచలన ఆరోపణలు చేశారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కమీషన్ల కోసమే నిర్మించారని.. ఆ ప్రాజెక్టుతో పని లేకుండానే ఈ ఏడాది 1.56 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి రావడమే ఇందుకు నిదర్శనమన్నారు.అలాంటపుడు లక్షల కోట్లు ఖర్చుపెట్టి ఎందుకు నిర్మించారని నిలదీశారు. అలాగే పదేళ్లుగా మెట్రో విస్తరణను కేసీఆర్, కిషన్ రెడ్డి(Kishan Reddy) అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.