దేశంలో ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఓటర్లలో రాను రానూ అసాసక్తత, నిర్లక్ష్యం, నిర్లిప్తత పెరుగుతుండడం పట్ల చీఫ్ ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లోని యువత ఓటు హక్కు పట్ల ఉదాసీనంగా ఉంటోందంటూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కొద్ది రోజుల క్రితం ఒక సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మే నెలలో కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆయన బెంగళూరులో ‘ఎలక్షన్ 2023’ పేరుతో ఒక సుదీర్ఘ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎన్నికల ప్రక్రియ క్రమక్రమంగా బలహీనపడుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యారంగం, పౌర సమాజానికి చెందిన ప్రముఖులు, కీలక వ్యక్తులంతా పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను మెరుగుపరచి, ఓటర్లలో పెరుగుతున్న ఉదాసీన వైఖరికి పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశంలో ప్రయత్నాలు జరిగాయి. వీరంతా చీఫ్ ఎన్నికల కమిషనర్‌కు తమ అభిప్రాయాలతో పాటు, సలహాలు, సూచనలు అందజేశారు.
ఓటు హక్కు, ఓటింగ్ ప్రక్రియ, ఎన్నికల పట్ల ఓటర్లలో పెరుగుతున్న ఉదాసీన వైఖరి, నిరాసక్తత, రాజకీయాల పట్ల అనాసక్తత, అభ్యర్థులు, రాజకీయాల పట్ల అవగాహన లేమి, రాజకీయ పార్టీల సిద్ధాంతాల పట్ల నిర్లక్ష్యం, నిరాశా నిస్పృహలు వగైరా ధోరణులు క్రమంగా పేట్రేగుతుండడంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. దేశంలో మొదటిసారిగా 1952లో ఎన్నికలు జరిగినప్పుడు 45.7 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి.2019 నాటికి అది 67.40 శాతానికి చేరుకుంది.1952, 2019 సంవత్సరాల మధ్య దేశ జనాభా 37.29 కోట్ల నుంచి 138.31 కోట్లకు పెరిగింది. ఇంతగా దేశ జనాభా పెరగడంతో పాటు ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరగాల్సింది. అదే విధంగా, 1952లో 18.33 శాతం ఉన్న అక్షరాస్యత రేటు ప్రస్తుతం 77 శాతానికి పెరిగింది. అయినప్పటికీ ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. పట్లణ, నగర ఓటర్లలో ఉన్న నిరాసక్తత వల్ల ఆ సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగడం లేదనే చెప్పాలి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దేశానికి సిలికాన్ లోయగా గుర్తింపు పొందిన బెంగళూరు నగరం ఇందుకు చక్కని ఉదాహరణ. ఇక్కడున్న నాలుగు జోన్లలోనూ 2013-18 మధ్య ఓటింగ్ శాతం గణనీయంగా పడిపోయింది.1952 నుంచి ఓటింగ్ శాతంలో అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న కర్ణాటకలో కూడా ఇప్పుడు ఓటింగ్ శాతం ఏడాదికి ఎంత లేదన్నా రెండు శాతం వరకూ తగ్గిపోతోంది.గుజరాత్‌లో కూడా దాదాపు ఇదే రకమైన పరిస్థితి నెలకొని ఉంది. 2017 నాటి ఓటింగ్ శాతం కన్నా 2019 నాటికి ఇక్కడి ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గిపోయి ఎన్నికల అధికారులను కలవరపెట్టింది.హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఒకప్పుడు 75 శాతానికి పైగా ఓటింగ్ గత శాసనసభ ఎన్నికల్లో 65 శాతాన్ని మించి పోలేదు. ఈ ఆందోళనకర పరిస్థితిని గమనించిన చీఫ్ ఎన్నికల కమిషనర్ ఈ పరిస్థితిలో మార్పు తీసుకు రావడానికి ఒక వినూత్న పరిష్కార మార్గం ఆలోచించారు. రెండు రోజుల క్రితం ‘ఇంటి నుంచే ఓటు’ అనే పథకాన్ని ప్రకటించారు. కర్ణాటక ఓటర్లలో 80 ఏళ్లు, అంతకు పైబడినవాళ్లు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేయవచ్చని ప్రకటించారు.ఈ వృద్ధుల సంఖ్య 12.5 లక్షల వరకూ ఉంటుంది.దివ్యాంగుల సంఖ్య కూడా 5.5 లక్షల వరకూ ఉంటుంది.
ఇంటి నుంచి ఓటు వేయడానికి సిద్దపడినవారి ఇళ్లకు అధికారులు వెళ్లి వారి గుర్తింపు కార్డులు తనిఖీ చేసి, ఎలా ఓటు వేయాలో నేర్పి, వీడియో తీయడం జరుగుతుంది. పారదర్శకత్వం కోసం రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ఇటువంటి ఓటర్ల వివరాలు చెప్పడంతో పాటు, ఓటును రహస్యంగా ఉంచాల్సిన అవసరాన్ని, ఓటును రహస్యంగా వేయాల్సిన అగత్యాన్ని ఈ ఓటర్లకు వివరించడం జరుగుతుంది. ముందుగా కర్ణాటక రాష్ట్రంతో ప్రారంభమైన ఈ ప్రక్రియను ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రమే పరిమితమైన ఈ విధానాన్ని ఆ తర్వాత ఇతర వర్గాలకు విస్తరించే ఆలోచన కూడా చేస్తారు. దీనివల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని, ఓటర్ల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఇటువంటి విధానం విజయవంతం కావాలన్న పక్షంలో ఓటర్లలో రాజకీయ చైతన్యం అవసరం. అంతేకాదు, ఆలోచనా ధోరణిలో కూడా మార్పు అవసరమవుతుంది.
Vote from Home: ఇంటి నుంచే ఓటు!
- Advertisement -