ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham Kumar Reddy) సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసి, కార్మికులను బయటికి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. టన్నెల్ ప్రమాదాల్లో పాల్గొనే నిపుణులతో పాటు సరిహద్దుల్లో టన్నెల్స్ నిర్మించే నిపుణులను సహాయ చర్యల కోసం పిలిపిస్తున్నామని తెలిపారు. అవసరమైతే విదేశాల్లోని టన్నెల్ నిపుణుల సహాయం తీసుకునేందుకు సిద్ధమయ్యామని వెల్లడించారు.
టన్నెల్‌లో భారీగా నిలిచిపోయిన నీరు, బురదను తొలగిస్తే పూర్తిగా లోపలికి వెళ్లగలమని తెలిపారు. టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ది పొందేవారి గురించి తాము పట్టించుకోమని మండిపడ్డారు. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కాగా నాలుగు రోజులుగా టన్నెల్‌లోనే ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.