ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా(Kumbh Mela) ఘనంగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళా విశేషాలను ప్రధాని మోదీ(PM Modi) సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులువు కాదన్నారు. ఏర్పాట్ల విషయంలో అసౌకర్యానికి గురైతే భక్తులు క్షమించాలని కోరారు. భారతీయ ఐక్యతకు కుంభమేళా నిదర్శనంగా నిలిచిందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారని పేర్కొన్నారు.
త్రివేణి సంగమం నదీ తీరానికి అన్ని కోట్ల మంది ఎలా వచ్చారా? అని యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోందన్నారు. అయినా పవిత్ర సంగమంలో పుణ్యస్నానాల కోసం వారంతా తరలివచ్చారని తెలిపారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మంది వ్యయప్రయాసలను మరిచి కుంభమేళాకు రావడం ఆనందంగా ఉందని మోదీ వెల్లడించారు.
కాగా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు సాగిన మహా కుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. సామాన్యులతో పాటు పలువురు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.