తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanath Reddy) చేసిన ఆరోపణలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో తాను ఏదైనా ప్రాజెక్టును అడ్డుకున్నట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. సీఎంగా ఉన్న వ్యక్తి అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి తెలంగాణకి సీఎం కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ దుందుడుకుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రం నుంచి డబ్బులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో చెప్పారా? అని ప్రశ్నించారు. బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు భయపడే రకం తాను కాదని తెలిపారు.
కాగా ఢిల్లీ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టును కేంద్ర మంత్రివర్గం వద్దకు వెళ్లకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తన మిత్రుడు కేసీఆర్ పదేళ్లలో చేయని పని ఇప్పుడు చేస్తే తనకు పేరొస్తుందనే అలా అడ్డుకున్నారని తెలిపారు. తనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే పేరు ముఖ్యం కాదని.. కావాలంటే అనుమతులు, నిధులు తెప్పించి కిషన్ రెడ్డినే పేరు తెచ్చుకోమనండని సూచించారు. రాష్ట్రాభివృద్ధికా కావాల్సిన నిధులు తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లదే అన్నారు. లేదంటే వారిద్దరూ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవాలని సూచించారు.