పాలన చేతకాక రాష్ట్రంలో జరుగుతున్న మరణాలపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)తనపై ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. ఛీఫ్ మినిస్టర్‌గా మాట్లాడాలి కానీ చీప్ మినిస్టర్‌గా మాట్లాడవద్దని సూచించారు. అధికారంలో ఉన్నామనే సంగతి మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు చేసుకోవచ్చని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజలకు మంచి చేయాల్సింది పోయి రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాగా నిర్మాత కేదార్ అనుమానాస్పద మృతి వెనక కేటీఆర్ హస్తం ఉండొచ్చని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఎస్‌ఎల్‌బీసీ(SLBC) టన్నెల్ ఘటనలో అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే తమపై సీఎం విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం వ్యవహార శైలి ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుందని సెటైర్లు వేశారు. పదేళ్లు ఆగిన ప్రాజెక్టును జాగ్రత్తలు తీసుకోకుండా నిపుణులను సంప్రదించకుండా ప్రారంభించారని తెలిపారు. రేవంత్ రెడ్డి ధనదాహం వల్లే టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను రక్షించకుండా తమపై అభాండాలు వేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.