వచ్చే నెల నుంచి ఐపీఎల్(IPL 2025) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టోర్నీ షెడ్యూల్ కూడా వచ్చేసింది. దీంతో ఫ్రాంఛైజీలు తమ టీమ్ గెలుపు కోసం ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణతో పాటు మంచి సపోర్టింగ్ స్టాఫ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్(Kevin Pietersen)కు కీలక బాధ్యతలు అప్పగించింది. రాబోయే సీజన్‌కు తమ జట్టు మెంటార్‌గా నియమించింది. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది.
కాగా పీటర్సన్ 2012 నుంచి 2014 వరకు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. 2014 సీజన్‌లో డీసీకి కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఇప్పుడు మళ్లీ అదే జట్టుకు మెంటార్ రూపంలో సేవలు అందించనున్నాడు. ఇప్పటికే ఢిల్లీ హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ హేమాంగ్ బదానీ, డైరెక్టర్‌గా మరో మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావు, అసిస్టెంట్ కోచ్‌గా మాథ్యూ మాట్, బౌలింగ్ కోచ్‌గా మునాఫ్ పటేల్ వ్యవహరిస్తున్నారు. ఇక ఢిల్లీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ లేదా టీమిండి ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ వ్యవహరించే అవకాశముంది.