అన్నమయ్య జిల్లాలో.. సినీ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి విచారణ కొనసాగుతోంది. దాదాపు ఆరు గంటల పాటు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, సీఐ వెంకటేశ్వర్లు పోసానిని విచారిస్తున్నారు. అయితే విచారణ సమయంలో పోసాని తమకు సహకరించట్లేదని పోలీసులు ఆరోపిస్తున్నారు.
ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటున్నారని వారు తెలిపారు. పోసాని మాట్లాడితేనే విచారణ ముందుకు సాగుతుందని చెబుతున్నారు. అడిగిన ప్రశ్నలకు పోసాని తికమక సమాధానాలు చెబుతున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానమిస్తున్నారని.. ఓబులవారిపల్లి పోలీసులు అంటున్నారు.
ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు రైల్వే కోడూరు కోర్టు పీపీ భ్రమరాంబ, ప్రభుత్వ తరపు న్యాయవాదులను అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పిలిపించారు. అలాగే, పోసాని కృష్ణ మురళి తరఫున వాదించడానికి రైల్వే కోడూరు న్యాయస్థానానికి సీనియర్ న్యాయవాది, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సైతం వచ్చారు. పోసాని తరుపున బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.