తెలంగాణలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలో గురువారం రాత్రి జరిగిన మహిళ దారుణ హత్యపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. సదాశివపేట సమీపంలో మహిళపై అత్యంత కిరాతకంగా ప్రవర్తించి దారుణ హత్యకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. సంగారెడ్డిలో తమ పిల్లలను స్కూల్‌కు పంపించాలన్నా తల్లిదండ్రులు భయందోళనలో ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రతిరోజు ఎక్కడో చోట హత్యలు, దొంగతనాలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు చేయకపోతే సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హోంశాఖ సీఎం చేతిలో ఉన్నా కూడా ప్రజలకు భద్రత కల్పించలేకపోతే ఎలా అని రాజాసింగ్ నిలదీశారు.