ఏపీ ప్రభుత్వం తల్లులకు శుభవార్త చెప్పింది. సూపర్ సిక్స్ పథకమైన తల్లికి వందనం(Thalliki Vandanam) పథకానికి బడ్జెట్‌లో (AP Budget 2025)రూ.9వేల 407 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15000 చొప్పున అందించనన్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు. 1 నుండి 12వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఇది వర్తిస్తుందని తెలిపారు. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఎలాంటి కారణం చేతనైనా ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వం పాఠశాల విద్యా వ్యవస్థ పట్ల దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 2.43 లక్షల మంది విద్యార్థులు బడి మానేశారని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక మంత్రి నారా లోకేశ్ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలు పెట్టారన్నారు. ఇక సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిషన్ పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫారమ్‌లు అందిస్తున్నామని.. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని పయ్యావుల చెప్పుకొచ్చారు.