ఏపీ వార్షిక బడ్జెట్‌లో భాగంగా అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్(Agriculture Budget)ను మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) ప్రవేశపెట్టారు. రూ.48, 340 కోట్లు కేటాయింపులు ప్రకటించారు. దేశం, రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగం అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రధాన వనరుగా ఉన్న వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించామన్నారు. ఎరువుల నిర్వహణకు రూ. 40 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ. 61 కోట్లు, యంత్రాల రాయితీకి రూ. 139. 65 కోట్లు, డ్రోన్ల రాయితీలకు రూ.80 కోట్లు, కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాల ఏర్పాటుకు రూ.875 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాల కోసం రూ.250 కోట్లు, కొత్త కౌలు చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకున్నట్లు అచ్చెన్న ప్రకటించారు.
వ్యవసాయ రంగంలో 15 శాతం వృద్ధి తమ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రోత్ ఇంజిన్లుగా 11 పంటలను తీసుకుంటున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7. 78 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశామన్నారు. రూ. 120 కోట్ల విత్తన రాయితీ బకాయిలను చెల్లించామని పేర్కొన్నారు. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. వికసిత్ భారత్- 2047కు అనుసంధానంగా ఏపీని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.