తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)ల మధ్య కొంతకాలంగా మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలకు కిషన్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. తాజాగా కిషన్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ 9 పేజీలతో సీఎం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేశారో వివరించారు. ‘తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టుల మంజూరులో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా మీ బాధ్యతను గుర్తు చేయడం కోసం లేఖ’ అని సీఎం పేర్కొన్నారు.
“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు వ్యాఖ్యలు చేయడం పూర్తి బాధ్యతారాహిత్యం. తెలంగాణలో 2023, డిసెంబరు 7న ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే పూర్తి బాధ్యతాయుతంగా, పారదర్శకంగా మా పాలన సాగుతోంది. భారత రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య విధానానికి పూర్తిగా కట్టుబడి ఉండి దానిని అనుసరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ప్రజల ప్రయోజనాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఈ క్రమంలోనే తెలంగాణ అభివృద్ధికి కీలకమైన హైదరాబాద్ మెట్రో ఫేజ్-II, ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్), మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రైలు, డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని బందరు సీ పోర్ట్‌కు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణాలకు సంబంధించి అనుమతుల సాధనకు కేంద్ర ప్రభుత్వ విధివిధానాలను పూర్తిగా పాటిస్తున్నాం. ఈ విషయం మీకు స్పష్టంగా తెలుసు. ఆయా ప్రాజెక్టుల సాధనకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో పాటు మిమ్మల్ని కలిసిన విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను” అని లేఖలో తెలిపారు.
తెలంగాణకు జీవనాడి అయిన హైదరాబాద్ నగరంలో మెట్రో ఫేజ్ -I (69 కి.మీ.) నిర్మాణాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. మెట్రో రాకతో హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్-II ప్రాజెక్ట్‌పై పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలలు స్వీకరించిన తర్వాత మెట్రో ఫేజ్-II పూర్తికి దృష్టిసారించాను. హైదరాబాద్ నలుమూలలనూ సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు వీలుగా మెట్రో సేవలను విస్తరించడమే లక్ష్యంగా అయిదు కారిడార్లను ప్రతిపాదించాం. ఇక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను 2024, జులై 22వ తేదీన కలిసి వివరాలతో కూడిన లేఖను అందజేశాం” అని వివరించారు.