2025-26 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్‌ను ఏపీ అసెంబ్లీ(AP Assembly)లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బడ్జెట్ కేటాయింపులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3.22లక్షల కోట్లతో బడ్జెట్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.2,51,162 కోట్లు రెవెన్యూ వ్యయంగా ప్రకటించింది. మూలధన వ్యయం రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా వెల్లడించింది.
బడ్జెట్ అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Ayyannapatrudu) సభను సోమవారానికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ‘బడ్జెట్ మీద సభ్యులందరికీ పూర్తిగా అవగహన రావాలి. రేపు, ఎల్లుండి సెలవు ఇస్తున్నాం అందరూ బడ్జెట్‌ను పూర్తిగా చదివి అర్ధం చేసుకోవాలి. బడ్జెట్ మీద మాట్లాడటానికి అసెంబ్లీలో మూడు రోజులు సమయం ఇస్తున్నాం’ అని తెలిపారు.