Saturday, March 1, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: ఇది ముంచే ప్రభుత్వం.. బడ్జెట్‌పై షర్మిల విమర్శలు

YS Sharmila: ఇది ముంచే ప్రభుత్వం.. బడ్జెట్‌పై షర్మిల విమర్శలు

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర విమర్శలు చేశారు. ఇది మంచి ప్రభుత్వం కాదని ముంచే ప్రభుత్వం అని తొలి బడ్జెట్‌తోనే నిరూపితమైందని విమర్శించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ సంఖ్య ఘనం – కేటాయింపులు శూన్యం. అంతా అంకెల గారడి – అభూత కల్పన. దశ – దిశ లేని.. పస లేని బడ్జెట్ ఇది. రాష్ట్రం గుల్ల.. బడ్జెట్ అంతా డొల్ల. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించారు. సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు. అన్నదాత సుఖీభవ పథకానికి కేవలం రూ.6,300 కోట్లు కేటాయించడం అరకొరనే. రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు ఎదురుచూస్తుంటే.. రూ.11 వేల కోట్లు నిధులు కావాల్సి ఉంటే.. కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ కోసం రైతులను నిరీక్షణకు గురి చేయడం అన్యాయం. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే ముష్టి రూ.300 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఇవ్వడం ద్రోహమే . తల్లికి వందనం పథకానికి నిధుల్లో కోత పెట్టారు. రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులకు కావాల్సింది రూ.12,600 కోట్లు అయితే.. రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే దాదాపు రూ.3వేల కోట్ల మేర విద్యార్థుల సంఖ్య తగ్గించదలుచుకున్నారా ? దీపం 2 పథకానికి ఏడాదికి అవసరం అయిన నిధులు సంఖ్య రూ.4500 కోట్లు. బడ్జెట్‌లో ఉచిత సిలిండర్ల పథకానికి కేటాయింపులు రూ.2601 కోట్లు. కోటిన్నర లబ్ధిదారులు ఉండగా సగం మేర కోత పెట్టదలుచుకున్నారా ?

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ లో నెలకు రూ.350 కోట్లు కేటాయించే పథకానికి నిధులు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వానికి మనసు రాలేదు. నెలకు రూ.1500 ఇచ్చే మహాశక్తి పథకాన్ని మాయం చేశారు. కోటిన్నర మంది మహిళలను అన్యాయం చేశారు. రూ.10 లక్షల వరకు ఉచిత రుణాలు అని చెప్పి ఒక్క రూపాయి కేటాయించకుండా డ్వాక్రా మహిళలను మోసం చేశారు. నిరుద్యోగ భృతి పథకం ఊసే లేదు. జాబ్ క్యాలెండర్ ప్రస్తావనే లేదు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పి బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను వంచించారు. రాష్ట్ర రాజధానికి ఒక్క రూపాయి కేటాయించకుండా అప్పులతోనే అమరావతి కట్టాలని చూడటం మీ అవివేకానికి నిదర్శనం. రాష్ట్ర ప్రజలను మోసం చేసి , ఎన్నికల హామీలను గాలికి వదిలేసి మసి పూసి మారేడు కాయ చేశారు” అని షర్మిల వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News