మార్చి 1 నుంచి 6 వ తేదీ వరకు ప్రసిద్ధిగాంచిన మంత్రాలయం(Mantralayam)లో శ్రీ రాఘవేంద్ర స్వామి(Guru Raghavendra) గురు మహోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండువగా కొనసాగనున్నాయి. పవిత్ర తుంగభద్రా నది తీరంలో వెలసిన ఆధ్యాత్మిక గురువు రాఘవేంద్ర స్వామి వారి 404వ పట్టాభిషేక మహోత్సవం 430వ వర్ధంతి మహోత్సవాలు ఆరు రోజులపాటు కొనసాగనున్నాయి.
ఉత్సవాలకు రానున్న మంత్రి లోకేశ్
రేపటి నుంచి ప్రారంభమయ్యే మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి గురు వైభోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రానున్నారు. ముందుగా అమరావతి నుంచి హెలికాప్టర్ ద్వారా మంత్రాలయం చేరుకున్న తరువాత క్షేత్రంలోని మంచాలమ్మా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి
ఈ మహోత్సవాలని తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ముంబై, చెన్నై, కేరళ తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో మంత్రాలయం క్షేత్రానికి చేరుకుంటున్నారు.
అన్ని రకాల ఏర్పాట్లు
మంత్రాలయం క్షేత్రానికి వచ్చే భక్తులు ముందుగా ఆలయంలోని మంచాలమ్మా అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా రేపటి నుంచి జరగబోయే గురు వైభోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహోత్సవం సందర్బంగా మంత్రాలయం క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వసతి ఏర్పాట్లు ప్రత్యేక మంచినీటి సదుపాయాలు కల్పించేందుకు జిల్లా అధికారులతో కలిసి మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థులు పరిశీలిస్తున్నారు.
రాఘవేంద్ర స్వామి చరిత్ర
హిందూ మతంలో ప్రముఖమైన గురువు రాఘవేంద్ర స్వామి. ఈయన 16వ శతాబ్దంలో జీవించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇతను వైష్ణవాన్ని అనుసరించాడు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తమిళనాడు-భువనగిరి వాసులైన తిమ్మనభట్టు-గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు (రాఘవేంద్రస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే!) 1595లో జన్మించారు.
5 ఏళ్ల వయస్సులోనే అక్షరాభ్యాసం చేసి ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు. యుక్తవయసు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని.. సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఈయన మహిమాన్వితుడని భక్తుల నమ్మకం.
దేశ, విదేశాల నుంచి భక్తుల రాక
ఎలాంటి వారికైనా మనసు ఆందోళనగా ఉన్న ఎలాంటి కష్టాలు ఉన్న ఒక్కసారి ఈ క్షేత్రానికి వస్తే మనసు కుదుట పడి కష్టాలన్నీ తిరిపోయి ప్రశాంత జీవితం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినిమా తారలు కూడా నిత్యం అధిక సంఖ్యలో వస్తుంటారు.