ఏపీలో వాహనదారులకు బిగ్ అలర్ట్. నేటి నుంచి ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) మరింత కఠినంగా ఉండనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ అమలు కానుంది. ఈ చట్టం ప్రకారం వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఇకపై హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ.1000 జరిమానా విధించనున్నారు. బైక్ వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి.
సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడిపితే రూ.1000, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే రూ.10వేల జరిమానాతో పాటు లైసెన్స్ కూడా రద్దు చేయనున్నారు. ఓవర్ స్పీడ్ , సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ చేస్తే గరిష్టంగా రూ.1000 వరకూ ఫైన్ విధించనున్నారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే రూ.5వేలు జరిమానాతో పాటు వాహనం సీజ్ చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వాహనదారులకు ఇంటికే చలాన్ కాపీని పంపించనున్నారు. అందుచేత ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.