ఎన్నికల హామీల అమలుకు బడ్జెట్ లో కేటాయింపులు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను పచ్చిగా మోసం చేసిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే కాలర్ పట్టుకుని ప్రశ్నించాలన్న నారా లోకేష్ మంత్రిగా తన పోలీస్ భద్రతను పక్కకు పెట్టి ప్రజల్లోకి రాగలరా అని సవాల్ చేశారు. కూటమి ప్రభుత్వ దగాలపై ప్రజలు లోకేష్ కాలర్ పట్టుకుని ప్రశ్నించేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…
రాష్ట్రంలోని ప్రజలు బడ్జెట్ లో తమ ఆకాంక్షలకు అనుగుణంగా కేటాయింపులు ఉంటాయని ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తామో చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు బడ్జెట్ లో వారు చేసిన కేటాయింపులే వారి మోసాన్ని బయటపెట్టాయి.
- కడప జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం
కడప జిల్లాలో సుమారు రూ. రెండు నుంచి మూడు వేల కోట్లతో జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్, దానితో లింక్ ఉన్న హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ కు రూ.అయిదు వేల కోట్లు అవసరం. గత తొమ్మిది నెలల నుంచి ఒక్క పైసా విలువైన పనులు కూడా ఈ రెండు ప్రాజెక్ట్ ల్లో జరగడం లేదు. కడప ఉక్కు…మా హక్కు అని ఆనాడు మేం పోరాటం చేశాం. వైయస్ జగన్ గారి హయాంలో జిందాల్ ను తీసుకువచ్చి, ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు ప్రయత్నిస్తే, ఇప్పుడు దానిని కూడా అడ్డుకున్నారు. ఈ రాష్ట్రంలో కీలకమైన వైద్యవిద్యను ఆనాడు వైయస్ జగన్ గారు ప్రోత్సహిస్తూ 750 కొత్త మెడికల్ సీట్లను సాధిస్తే, చంద్రబాబు ఇప్పుడు వాటిని మాకు అవసరం లేదంటూ లేఖ రాయడం దుర్మార్గం కాదా? - దోపిడీ బ్యాచ్ లో చేరిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ కూడా ఈ దోపిడీ బ్యాచ్ లో చేరిపోయారు. ప్రజల్లో ఆయనపై ఉన్న గౌరవం మసకబారుతోంది. మూడేళ్ళపాటు ప్రభుత్వంలో అధికారంను అనుభవించి, ఆ తరువాత ఆయన ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి, పోరాడతాడని కొందరు చెబుతున్నారు. ఇటువంటి నాటకాలను ప్రజలు క్షమించరు. నిజంగా పవన్ కళ్యాణ్ కు ప్రజాసమస్యలపై ప్రశ్నించే గుణం ఉంటే వెంటనే తన రాజకీయ ప్రయోజనాలను పక్కకుపెట్టి ప్రజల కోసం పనిచేయాలి. - చంద్రబాబు బృందం బూతులపై చర్యలేవి?
కూటమి ప్రభుత్వంలో అధికార బలంతో ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోసాని కృష్ణమురళిని అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసి, దానిని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ లు గతంలో మాట్లాడిన బూతులకు సంబంధించిన వీడియోలు కూడా మా వద్ద ఉన్నాయి. వాటిని ప్రజల ముందు పెడతాం. వాటిమీద కూడా కేసులు పెట్టించుకుంటారా? రాజకీయాల్లో ఎదుటివారు చౌకబారుగా మాట్లాడినప్పుడు, అదుపు తప్పినప్పుడు దానికి ఎవరైనా అదే పంథాలో సమాధానం చెబుతారు. మీరు అనేక సందర్భాల్లో ఇలా మాట్లాడినప్పటికీ వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో దానిని అడ్డం పెట్టుకుని ఇప్పుడు మీరు చేస్తున్నట్లుగా ఎక్కడా తప్పుడు కేసులు పెట్టలేదు. - వైయస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా జన ప్రభంజనం
జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రభంజనంగా జనం తరలివస్తున్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఈ జన ప్రభంజనాన్ని చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంబేలెత్తారు. జగన్ పై ఎంతగా బురద చల్లాలని ప్రయత్నించినా, ప్రజల్లో ఆయనకు ఉన్న అభిమానాన్ని తగ్గించలేరు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని నిత్యం గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందంటూ సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వం తమ అసమర్థతను దాచిపెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవారికి వైయస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిబడింది. మీలాగా ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, మోసం చేయడమే నైజంగా వ్యవహరించ లేదు. ఈ రాష్ట్రానికి వైయస్ జగన్ పాలనే స్వర్ణయుగంగా నిలబడుతుంది.
మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదులిస్తూ
హోం మంత్రి అనిత రెడ్ బుక్ రాజ్యాంగం అమలు గురించి చేసిన వ్యాఖ్యలు సరికాదు. భారత రాజ్యాంగం చంద్రబాబు, లోకేష్ దయాదాక్షిణ్యాలపై నడవడం లేదు. ప్రజల హక్కులను రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా కాలరాస్తామంటే కుదరదు. ఈ రోజు అధికారం ఉందని, పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకం చేస్తే, రేపు పదింతలు దానికి ప్రతిఫలంను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన పుంఖాను పుంఖానులుగా ఎల్లో మీడియాలో తప్పుడ రాతలు రాశారు. అభాండాలు వేశారు. ఏం చేయగలిగారు. ఏ ఒక్కటైనా నిరూపించారా?
- తిరుమల లడ్డూ కల్తీపైనా అబద్దాలు చెప్పారు. బుడమేరు వరదల్లో ప్రకాశం బ్యారేజీపైకి పడవలు వదిలారని అన్నారు. బియ్యం అక్రమ రవాణాపైనా ఆరోపణలు చేశారు. సీజ్ ద షిప్ ఏమయ్యిందీ? ఇవ్వన్నీ కట్టుకథలని తెట్టతెల్లం కాలేదా?
- చంద్రబాబు రాజకీయ లబ్ది కోసం ఎటువంటి అబద్దాలైన చెబుతారు? కానీ పత్రికలు మాత్రం విలువలకు కట్టుబడి ఉండాలి. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ఈ తొమ్మిది నెలల నుంచి ఎటువంటి రాతలు రాశారు. వాటిపైన ఎక్కడైనా చర్యలు ఉన్నాయా? ఆ పత్రికల ప్రతిష్ట మసకబారడం లేదా? అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.