సుస్థిర, బాధ్యతాయుత, సమగ్ర, పర్యావరణహిత పర్యాటక విధానాలతో అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మార్చి 4 నుండి 6 వరకు జర్మనీలో జరిగే ఐటీబీ బెర్లిన్ -2025 సదస్సుకు హాజరవుతున్నానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం రాజమహేంద్రవరంలోని తన జిల్లా కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించిన మంత్రి దుర్గేష్ జర్మనీ పర్యటన వివరాలు మీడియాకు వెల్లడించారు.

జర్మనీ లోని బెర్లిన్ ఎక్స్ పో సెంటర్ సిటీ వేదికగా మూడు రోజుల పాటు జరిగే ఐటీబీ సదస్సుకు హాజరయ్యే పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని, స్థానికంగా ఉన్న అవకాశాలు,వనరులు చూసి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తానని తెలిపారు. ప్రపంచ పర్యాటక చిత్రపటంలో ఏపీని ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు,వేగవంతమైన పర్యాటకాభివృద్ధికి జర్మనీ వేదికగా నిలుస్తుందని భావిస్తున్నానన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పవర్ ఆఫ్ ట్రాన్సిషన్ లైవ్స్ హియర్ అనే థీమ్ తో ఐటీబీ బెర్లిన్ -2025 ఈవెంట్ జరుగుతోందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక వాణిజ్య ప్రదర్శన ఇంటర్నేషనల్ టూరిజం బోర్స్ బెర్లిన్(ఐటీబీ బెర్లిన్)లో పర్యాటక మంత్రిగా తాను, ఎండీ ఆమ్రపాలి పాల్గొని బెర్లిన్ వేదికపై రాష్ట్ర ప్రత్యేకతలు తెలిపి ఇన్వెస్టర్లను ఆకర్షిస్తామని పేర్కొన్నారు.ట్రావెల్ , టూరిజం వృద్ధికి నిరంతరం ప్రేరణనిచ్చే ఈ ట్రేడ్ ఫెయిర్ లో 400కు పైగా అంతర్జాతీయ నిపుణులు పాల్గొననున్నారని, 200 సెషన్స్, 17 థీమ్డ్ ట్రాక్స్ ప్రదర్శించబడనున్నాయన్నారు.ప్రఖ్యాత హోటళ్లు, పర్యాటక బోర్డులు, టూర్ ఆపరేటర్లు, సిస్టమ్ ప్రొవైడర్లు, పరిశ్రమల నుండి ప్రతినిధులు, ట్రావెల్ ఎక్స్ పర్ట్స్ తదితరులు పాల్గొననున్నారని వారందరి సమక్షంలో రాష్ట్ర పర్యాటక విధానాలు, వనరులను వివరించి పెట్టుబడులు ఆకర్షిస్తామన్నారు.
అడ్వెంచర్, కల్చర్, లగ్జరీ, మెడికల్, హెల్త్, ఎంఐసీఈ (Meetings, Incentives, Conferences, and Exhibitions) మరియు టెక్నాలజీ, లగ్జరీ ట్రావెల్, టూరిజం సెక్టార్ లో ఉపాధి అవకాశాల కల్పన, ప్రపంచ గమ్యస్థానంగా స్థానిక ప్రాంతాలను ఎలా తీర్చిదిద్దాలి వంటి అంశాలకు మార్గదర్శకత్వంగా ఐటీబీ బెర్లిన్ నిలుస్తుందన్నారు. విభిన్న రకాల పర్యాటక పద్ధతులు ఎలా అమలు చేయాలో చెప్పేందుకు ఈ వేదిక చోటు కల్పిస్తోందన్నారు. ప్రధానంగా సాంకేతిక పరివర్తన (డిజిటల్ ట్రాన్స్ ఫర్ మేషన్), సుస్థిర అభివృద్ధి, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, మార్కెట్ ట్రెండ్స్ ప్రధానాంశాలుగా ఈవెంట్ జరుగనుందన్నారు. అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేది పర్యాటక రంగం అని తెలుపుతూ భారీ స్థాయిలో పెట్టుబడులు రాబట్టడం ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించేందుకు అంతర్జాతీయ వేదికను ఉపయోగించుకోబోతున్నామన్నారు.

పర్యాటకానికి సాంకేతిక అనుసంధానం
1966లో స్థాపించబడిన ఐటీబీ బెర్లిన్ పర్యాటక రంగంలో వస్తోన్న తాజా పరిణామాలు, అంతర్జాతీయ పరిశ్రమల విధానాలు, వైవిధ్య పర్యాటక పద్ధతులు, ఆర్థికాభివృద్ధికి పర్యాటక రంగం దోహదపడటం, పర్యాటక రంగంలో పోటీతత్వం మెరుగుపరిచేందుకు వ్యూహాలు తదితర అంశాలపై చర్చించేందుకు అంతర్జాతీయంగా గొప్ప వేదికగా నిలుస్తోందన్నారు. వేగవంతమైన పర్యాటకాభివృద్ధి కోసం సరికొత్త వ్యూహాలను చర్చించి అమలు చేసేందుకు ఉపయోగకరంగా ఈ ఈవెంట్ ఉపయోగపడనుందని మంత్రి దుర్గేష్ వివరించారు.
ఏపీ గురించి వివరించేలా జర్మనీలో వరుస సమావేశాలు
ప్రధానంగా 30 మందికి పైగా పెట్టుబడిదారులతో తనతో పాటు టూరిజం ఎండీ ఆమ్రపాలి కాటప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరుపుతామన్నారు. తప్పనిసరిగా ఏపీలో పెట్టుబడి పెట్టేలా తాము వివరిస్తామన్నారు. ఏపీ పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను, సుస్థిర, బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని వివరించేందుకు వరల్డ్ మీడియాతో నిర్వహించే పత్రికా సమావేశంలో ప్రసంగించి తద్వారా అంతర్జాతీయంగా ఏపీ పర్యాటక రంగం గురించి తెలిసేలా వివరిస్తానన్నారు. అంతేగాక జర్మనీలోని భారత రాయబారి హెచ్.ఈ. అజిత్ గుప్తే ఆధ్వర్యంలో అక్కడే నివాసముంటున్న భారతీయులు, ప్రవాస భారతీయులు, వివిధ అంతర్జాతీయ పర్యాటక, వాణిజ్య సంబంధిత వాటాదారులతో కలిసి పర్యాటక రంగంలో ఏపీ ప్రత్యేకతను ఐటీబీ బెర్లిన్ వేదిక -2025పై వివరిస్తానన్నారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తలతో సంభాషించి రాష్ట్రంలో అనుసరిస్తున్న పెట్టుబడి అనుకూల విధానాలను వివరిస్తాను. వ్యాపారాన్ని సులభతరం చేసే క్రమంలో స్నేహపూర్వక విధానంలో ప్రవేశపెట్టిన సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని వివరిస్తాను.అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడంతో పాటు పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం దృష్టిసారించిన అంశాలివే
ఐటీబీ బెర్లిన్ వేదికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పర్యాటక పాలసీ 2024-29, పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా, పీపీపీ విధానం, పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకు కల్పించే ప్రోత్సాహకాలు, రాయితీలు వివరించి ఇన్వెస్టర్లను ఆకర్షిస్తానని వెల్లడించారు.రాష్ట్రంలోని బీచ్ లు, అందమైన సహజ ప్రకృతి దృశ్యాలు, చారిత్రక, వారసత్వ ప్రదేశాలు, సాంస్కృతిక సంపద, బౌద్ధ, అధ్యాత్మిక, ఎమ్ఐసీఈ పర్యాటకం తదితర అంశాలను వివరించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. పర్యాటక, అతిథ్య రంగాల్లో కల్పించే మౌలిక సదుపాయాలు,ఎకో టూరిజంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను హైలెట్ చేస్తానన్నారు. ఏపీని ఆహ్లాదం ఇచ్చే ప్రాంతంగానూ, మరోపక్క ఆదాయం ఇచ్చే ప్రాంతంగాను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పర్యావరణానికి విధ్వంసం కలిగేలా కాకుండా బాధ్యతాయుత పర్యాటకం అంశాలను ప్రస్తావించనున్నామన్నారు. సదస్సు అనంతరం మరో రెండు రోజులు వివిధ ప్రాంతాల పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా సమావేశమై పెట్టుబడులు ఆహ్వానిస్తామన్నారు.
త్వరలోనే హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులలో టూరిజం ఇన్వెస్టర్ సమ్మిట్ ల నిర్వహణ
ఇప్పటికే విజయవాడ, విశాఖపట్టణం, న్యూఢిల్లీలో రీజినల్ టూరిజం ఇన్వెస్టర్ల సమ్మిట్ లు నిర్వహించామని త్వరలోనే తిరుపతి, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులలో నిర్వహించనున్నామన్నారు. తద్వారా ఏపీకి ఉన్న పొటెన్షియాలిటీని వివరిస్తామన్నారు.గతంలో ఉన్న మంత్రులు బూతుల పొటెన్షియాలిటీని చెప్పారు కానీ పర్యాటక సామర్థ్యాన్ని చెప్పలేకపోయారని విమర్శించారు. స్థానికంగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పర్యాటక సామర్థ్యాన్ని తెలిపేందుకే బెర్లిన్ లో జరిగే సదస్సులో పాలుపంచుకుంటున్నానన్నారు. వైజాగ్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా రూ.1200కోట్లకు పైగా పెట్టుబడులు, 8 ఎంవోయూలు కుదుర్చుకున్నామని గుర్తుచేశారు.
త్వరలోనే బీచ్ లను అభివృద్ధి చేస్తాం
దేశంలో 7 బీచ్ లు బ్లూఫాగ్ సర్టిఫికేషన్ పొందితే అందులో రాష్ట్రంలోని రుషికొండ బీచ్ ఒకటన్నారు. బ్లూఫాగ్ సర్టిఫికేషన్ పొందడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపుతో పాటు అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు వస్తాయన్నారు. తద్వారా సరైన నిర్వహణతో బీచ్ పొడవునా పరిశుభ్రతకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కాకినాడ, సూర్యలంక, నెల్లూరులోని మైపాడ్ , మచిలీపట్నం బీచ్ లకు బ్లూఫాగ్ సర్టిఫికెట్ ల కోసం కృషి చేస్తున్నామన్నారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో మరింత అభివృద్ధికి ఆస్కారం ఉంటుందన్నారు.
అంతర్జాతీయ పర్యాటకులు ఏపీకి వచ్చేందుకు కృషి చేస్తున్నాం
టూరిజంతో పాటు ట్రావెల్ రంగం అభివృద్ధి కూడా ముఖ్యమని మంత్రి దుర్గేష్ తెలుపుతూ కనెక్టివిటీ పెంచేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, కడప, కర్నూలు ప్రాంతాల్లో విమానాశ్రయాలున్నాయని, రాబోయే రోజుల్లో మరిన్ని విమానాశ్రయాలను పెంచుకోవడం ద్వారా కనెక్టివిటీని విస్తరించవచ్చన్నారు. తద్వారా అంతర్జాతీయ పర్యాటకులు ఏపీకి వచ్చేందుకు అనువుగా ఉంటుందన్నారు.పర్యాటక ప్రాంతాల్లో సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతుల కల్పన ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు మెచ్చి వెల్లువలా పెట్టుబడులు
ఒబెరాయ్, మేఫైర్, తాజ్ గ్రూప్ లు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు మెచ్చి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చారని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఎట్మాస్పియర్ గ్రూప్ వైజాగ్, తిరుపతిలో పెద్ద ఎత్తున హోటళ్లు, రూమ్స్ పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. రాష్ట్రంలోని హరిత రిసార్ట్స్ టాప్ క్లాస్ రిసార్ట్ లుగా అప్ గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. జిల్లా టూరిజం అభివృద్ధి కౌన్సిల్ ద్వారా కలెక్టర్, ఎంపీ, ప్రజాప్రతినిధులు, తాను కలిసి కడియం నర్సరీల దగ్గర రిసార్ట్ లు నిర్మించే ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. పెట్టుబడిదారులకు భూమి అవసరమైతే ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపామన్నారు. ఇప్పటికే చాలా పర్యాటక ప్రాంతాల్లో పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. సీఎం సూచనల మేరకు రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 50వేల గదులు తయారయ్యేలా తాము అడుగులు వేస్తున్నామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 5000 గదులు నిర్మించేందుకు తాము కృషి చేస్తామన్నారు. పిచ్చుకలంకను పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులను వివరించారు.
నాడు పర్యాటకాన్ని పక్కనబెట్టి వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యమిచ్చారు
గత ప్రభుత్వంలో నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ లపై వ్యక్తిగత విమర్శలు చేసేందుకు నాటి పర్యాటక మంత్రి పనిచేశారని మంత్రి దుర్గేష్ విమర్శించారు. అద్భుతమైన సౌందర్యాలున్న ఏపీని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఏనాడూ కృషి చేయలేదన్నారు.రుషికొండలో వైసీపీ నిర్మించిన అక్రమ ప్యాలెస్ ల పై ఏప్రిల్, మేలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్యాలెస్ ను వారు స్వప్రయోజనాల కోసం కడితే తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగిస్తామన్నారు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన దక్షిణాసియా ట్రావెల్ అండ్ టూరిజం సదస్సుకు హాజరైనప్పుడు కొందరు ఐటీబీ ప్రతినిధులు తమ వద్దకు వచ్చి ప్రతి ఏటా ఏపీ ప్రభుత్వానికి ఐటీబీ ఈవెంట్ కు రమ్మని ఆహ్వానం పంపినా గడచిన ఐదేళ్లలో ఏరోజూ సంబంధిత మంత్రికానీ, అధికారులు కానీ హాజరుకాలేదని తెలిపినట్లు మంత్రి వివరించారు. ఈ క్రమంలో తాము ఐటీబీకి వస్తామని చెప్పడం శుభసూచకమని వారన్నట్లు మంత్రి తెలిపారు.
ఢిల్లీ సమ్మిట్ లో పాల్గొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సైతం ఏపీ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పర్యాటక, సాంస్కృతిక రంగాలపై చూపిస్తున్న చొరవతో ఇప్పటికే గండికోట, అఖండ గోదావరి ప్రాజెక్టులు మంజూరు చేశామన్నారు. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళితే ఏప్రిల్ నుండి రెండు మూడు పెద్ద ప్రాజెక్టులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, సంబంధిత డీపీఆర్ లు తయారుచేసుకోమని సూచించినట్లు మంత్రి గుర్తుచేశారు.ఏపీ ప్రభుత్వం సకాలంలో స్పందించడం వల్ల హర్యానాకు రావాల్సిన ప్రాజెక్టులను ఏపీకి మంజూరు చేసినట్లు షెకావత్ తెలిపినట్లు దుర్గేష్ వివరించారు. రాబోయే రోజుల్లో విశాఖ, తిరుపతి, అమరావతి, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, కాకినాడలో మరిన్ని పెద్ద ప్రాజెక్టులు ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.కేరళ,గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ లకు మించిన ప్రకృతి సౌందర్యాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ సరైన ప్రాచుర్యం, గుర్తింపు, ప్రోత్సాహం లేక పర్యాటక రంగంలో వెనుకబడిందన్నారు.
బెర్లిన్ తో పాటు స్పెయిన్, అమెరికా దేశాల్లో సైతం ఈ తరహా సమ్మిట్ లు జరుగుతున్నాయని అందులో బెర్లిన్ ఏపీకి సరైన వేదికగా భావించామన్నారు. రాష్ట్రాన్ని పర్యాటకాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలున్నప్పటికీ కూడా అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ప్రత్యేకతను వివరించమని ప్రోత్సహించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం అనంతరం మీడియా ప్రతినిధులు అందరూ మంత్రి దుర్గేష్ కు హ్యాపీ జర్నీ అంటూ విష్ చేశారు.